White House: అందుకే ప్రధాని మోదీని ట్విట్టర్‌లో అన్‌ఫాలో చేశాం!: శ్వేతసౌధం వివరణ
- ట్రంప్ పర్యటన చేసే దేశాల ఖాతాలను ఫాలో అవుతాం
- పర్యటనకు మద్దతు ఇస్తూ ఇలా చేస్తాం
- కొన్ని రోజులు మాత్రమే ఆ ఖాతాలను ఫాలో అవుతాం
- ఆ దేశాల ప్రముఖుల ట్వీట్లను రీట్వీట్ చేస్తాం
భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో అన్‌ఫాలో చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, కొన్ని రోజుల క్రితం వరకు వైట్ హౌస్ ట్విట్టర్ ఖాతా మొత్తం 19 మంది ట్విట్టర్ ఖాతాలను ఫాలో అవుతుండగా అందులో 14 మంది అమెరికన్లే ఉండేవారు. మిగతా ఐదు ఖాతాలు భారత్‌కు సంబంధించినవే ఉండేవి. ఇప్పుడు భారతీయుల ఖాతాలన్నింటినీ వైట్‌హౌస్ అన్‌ఫాలో చేసింది. ఇప్పుడు ప్రధాని మోదీ, భారత పీఎంవో కార్యాలయం, భారత రాష్ట్రపతి భవన్, ఇండియా ఇన్ యూఎస్‌ఏ, యూఎస్ ఎంబసీ ఇండియా ఖాతాలను శ్వేత సౌధం అనుసరించట్లేదు.
దీనిపై పలు రకాల వాదనలు వినిపిస్తోన్న నేపథ్యంలో శ్వేతసౌధం స్పందిస్తూ వివరణ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ దేశ పర్యటనకు వెళ్లాలనుకుంటే ఆ దేశ ట్విట్టర్ ఖాతాలను తాము ఆ సమయంలో కొన్ని రోజుల పాటు ఫాలో అవుతామని తెలిపింది.
ట్రంప్ పర్యటనకు మద్దతు ఇస్తూ ఇలా ఆ దేశాల ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను అనుసరిస్తామని వివరించింది. ఆయా ప్రముఖులు చేసిన ట్వీట్లను ఆ సమయంలో రీట్వీట్ చేస్తామని చెప్పింది. సాధారణంగా తాము అమెరికా ప్రభుత్వంలోని వివిధ శాఖల ట్విట్టర్ ఖాతాలను మాత్రమే ఫాలో అవుతామని వైట్ హౌస్ తెలిపింది.
కాగా, భారత రాష్ట్రపతి, ప్రధాని ఖాతాలను శ్వేత సౌధం అన్‌ఫాలో చేయడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందిస్తూ తాను దిగులు చెందుతున్నట్లు ట్వీట్ చేసి, చురకలంటించారు. ఈ విషయాన్ని మన విదేశాంగ శాఖ గుర్తించాలని ఆయన అన్నారు. కాగా, శ్వేతసౌధానికి ట్విట్టర్‌లో 22 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్‌కి 78 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన 46 మందిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు.