Yanamala: దానికదే వచ్చి పోవడానికి 'కరోనా' ఏమైనా మన చుట్టమా?: జగన్‌పై యనమల ఆగ్రహం

yanamala criticizes jagan decisions

  • జగన్‌ వ్యాఖ్యలు సరికాదు
  • నిర్లక్ష్య ధోరణి కనబర్చారు
  • దీంతో అధికారులూ కరోనాను తేలికగా తీసుకున్నారు
  • కరోనా కేసులు అధికంగా నమోదైన 15 జిల్లాల్లో కర్నూలు ఉంది

కరోనా వస్తుంది, దానికదే పోతుందంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని, అది వచ్చి పోవడానికి ఏమన్నా చుట్టమా? అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఏపీలో కరోనా మరణాలపై చేస్తోన్న ప్రకటనలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మృతుల సంఖ్యను దాచేస్తే కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

కరోనాపై నిజాలు బయటకు రాకుండా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు కాబట్టే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని చెప్పడం ఆత్మవంచనేనని అన్నారు. ఇలా చెబుతూ వారు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కరోనా వైరస్‌ కట్టడిపై నిపుణులందరూ తలలుపట్టుకుంటున్నారని, జగన్‌ మాత్రం చాలా తేలికగా తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

భారత్‌లో కరోనా కేసులు అధికంగా నమోదైన 15 జిల్లాల్లో కర్నూలు కూడా ఉందని గుర్తు చేశారు. జగన్ నిర్లక్ష్య ధోరణి వల్లే ఏపీ అధికార యంత్రాంగం కూడా ఈ వైరస్‌ను చాలా తేలిగ్గా తీసుకుందని ఆయన చెప్పారు. భారత్‌లో కొవిడ్‌-19 కేసుల వృద్ధిరేటులో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందని విమర్శించారు. మున్ముందు పలు రాష్ట్రాల కంటే ఏపీలోనే అధికంగా కేసులు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News