Arogya Setu: కొత్తగా తయారయ్యే ఫోన్లలో ఇకపై తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్..?
- ఆరోగ్య సేతు యాప్ తీసుకువచ్చిన కేంద్రం
- కరోనా రోగుల సమీపంలోకి వెళ్లినప్పుడు అప్రమత్తం చేసే యాప్
- ఫోన్ తయారీదశలోనే యాప్ ఇన్ స్టాల్ చేసేందుకు యత్నాలు!
కరోనాతో పోరాడుతున్న భారత్ లో ఆరోగ్య సేతు యాప్ ఎంతో పాప్యులారిటీ అందుకుంటోంది. కరోనా వైరస్ ఉన్న వ్యక్తికి సమీపంగా వెళ్లినప్పుడు ఈ యాప్ అప్రమత్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ లక్షల్లో డౌన్ లోడ్ అవుతోంది. 11 భాషల్లో ఈ యాప్ సేవలు అందుకోవచ్చు. ఆరోగ్య సేతు యాప్ ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ విధిగా తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలని, ఆ యాప్ లో సేఫ్ అని సూచించిన తర్వాతే ఆఫీసులకు రావాలని కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసింది.
అయితే తాజాగా ఈ యాప్ ను కొత్తగా తయారయ్యే ఫోన్లలో ముందే నిక్షిప్తం చేయాలని కేంద్రం భావిస్తోంది. కొత్త ఫోన్లతో పాటు వచ్చే యాప్ లలో ప్రీ ఇన్ స్టాల్ గా ఈ యాప్ కూడా ఉండాలన్నది కేంద్రం యోచన. ఈ మేరకు స్మార్ట్ ఫోన్ కంపెనీలను కూడా కోరినట్టు తెలుస్తోంది. కొత్త ఫోన్ వాడకం ప్రారంభించే సమయంలోనే ఆరోగ్య సేతు యాప్ లో యూజర్లు తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేయనున్నట్టు సమాచారం.