Ambati Rambabu: ‘కరోనా’కు వ్యాక్సిన్ కనిపెట్టే వరకూ చంద్రబాబు బయటకు రారేమో!: అంబటి రాంబాబు
- ‘హెరిటేజ్’ లో ‘కరోనా’ సోకితే చంద్రబాబు ఆపలేకపోయారు
- ఏపీకి వచ్చి మాత్రం ఆయన ఏం చేస్తారులే?
- సీఎం జగన్ వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరిస్తోంది
హైదరాబాద్ లో దాక్కున్న చంద్రబాబునాయుడు తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే వరకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయటకు రారేమో అంటూ సెటైర్లు విసిరారు.
ఉప్పల్ లోని హెరిటేజ్ సంస్థలో ‘కరోనా’ సోకితే ఆపలేని చంద్రబాబు, ఏపీకి వచ్చి మాత్రం ఏం చేస్తారులే అంటూ ఎద్దేవా చేశారు. ‘హెరిటేజ్’ లో ఏం జరుగుతున్నదో ఎల్లో మీడియా ఎందుకు బయటపెట్టడం లేదు? అని ప్రశ్నించారు. ‘కరోనా’ ఎవరికైనా సోకే ప్రమాదం ఉంది కనుక, ఈ వైరస్ నివారణకు వ్యాక్సిన్ వచ్చే వరకూ అందరూ జాగ్రత్తగా ఉండాలన్న సీఎం జగన్ వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరిస్తోందని దుయ్యబట్టారు. దేశంలోనే అత్యధికంగా ‘కరోనా’ పరీక్షలు నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని పొగడ లేని స్థితిలో ఎల్లో మీడియా ఉందని ధ్వజమెత్తారు.