Reliance Jio: 177 శాతం దూసుకెళ్లిన జియో లాభాలు!
- గత ఆర్థిక సంవత్సరం క్యూ-4లో అదరగొట్టిన జియో
- రూ. 840 కోట్ల నుంచి రూ. 2,331 కోట్లకు పెరిగిన నికర లాభం
- 38.75 కోట్లకు చేరిన వినియోగదారుల సంఖ్య
2029-20 ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల కాలంలో రిలయస్స్ జియో అదరగొట్టింది. సంస్థ నికర లాభం ఏకంగా 177 శాతం పెరిగి రూ. 2,331 కోట్లకు చేరింది. కస్టమర్ల సంఖ్య పెరగడం, టారిఫ్ లను పెంచడంతో పాటు, నెట్ వినియోగం తారస్థాయికి చేరడమే ఇందుకు కారణమని సంస్థ అభిప్రాయపడింది. 2018-19 నాలుగో త్రైమాసికంతో నెట్ ప్రాఫిట్ రూ. 840 కోట్లని సంస్థ వెల్లడించింది.
ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ. 14,385 కోట్లని, మార్చి 31 నాటికి 38.75 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందిస్తూ, వినియోగదారుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ కంపెనీగా నిలిచామని పేర్కొంది. ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం సైతం రూ. 130.60కు చేరిందని వెల్లడించింది.
కాగా, ఇటీవల ఫేస్ బుక్ తో రిలయన్స్ అనుబంధ జియో ప్లాట్ ఫామ్స్ డీల్ ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ తరువాత సంస్థ విలువ రూ. 4.62 లక్షల కోట్లకు చేరింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో నెట్ ప్రాఫిట్ 88 శాతం పెరిగి రూ. 5,562 కోట్లకు చేరుకోగా, ఆదాయం 34 శాతం పెరిగి రూ. 54,316 కోట్లకు పెరిగిందని వెల్లడించింది.