Maharashtra: ముంబైలో మరో కలకలం.. ఒకే పోలీస్ స్టేషన్‌లో 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్
- రెడ్ జోన్ ప్రాంతంలో విధులు నిర్వర్తించిన పోలీసులు
- కరోనా పాజిటివ్ వ్యక్తి నుంచి సోకి వుంటుందని అనుమానం
- పోలీసుల కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్
కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతున్న మహారాష్ట్రలో మరో కలకలం రేగింది. ఒకే పోలీస్ స్టేషన్‌లో 9 మంది కానిస్టేబుళ్లు వైరస్ బారినపడ్డారు. ముంబైలోని వడాలా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న వారిలో 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సీనియర్ ఇన్‌స్పెక్టర్ షాహాజీ షిండే తెలిపారు. బాధితులందరినీ బాంద్రా, పరేల్, దక్షిణ ముంబైలోని గురునానక్, కేఈఎం, బాంబే హాస్పిటళ్లకు తరలించినట్టు చెప్పారు. కరోనా బారినపడిన కానిస్టేబుళ్లు అందరూ 50 ఏళ్లు పైబడినవారేనని, వారి కుటుంబసభ్యులను క్వారంటైన్ చేశామని తెలిపారు.
వడాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు రెడ్‌జోన్లతోపాటు నాలుగు మురికివాడలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం ద్వారానే పోలీసులకు వైరస్ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు. రెడ్‌జోన్ పరిధిలోని ప్రజలకు పోలీసులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారని, ఈ సందర్భంగా కరోనా బాధితుడి నుంచి వారికి వైరస్ సోకి వుంటుందని పేర్కొన్నారు. కాగా, ముంబైలో మొత్తం 106 మంది పోలీసులు వైరస్ బారినపడగా, వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.