Lockdown: లింగంపల్లి నుంచి వలస కార్మికులతో తొలిరైలు బయలుదేరింది!
- 1200 మందిని హాతియాకు తరలించిన అధికారులు
- సామాజిక దూరం పాటించేలా బోగీలో 54 మందికే అనుమతి
- రైళ్లను నడిపించాలని పలు రాష్ట్రాల నుంచి కేంద్రానికి వినతి
మార్చిలో లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత తొలి ప్రయాణికుల రైలు, ఈ ఉదయం హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి నుంచి ఝార్ఖండ్ లోని హాతియాకు బయలుదేరింది. దాదాపు 1,200 మంది వలస కార్మికులు, తెలంగాణలో చిక్కుకుపోయిన ఝార్ఖండ్ కూలీలు ఈ రైలులో వెళ్లారు. 24 బోగీలను ఏర్పాటు చేసిన అధికారులు, ఒక్కో బోగీలో 72 బెర్త్ లు ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరి మధ్యా సామాజిక దూరం ఉండేలా చూస్తూ, 54 మందిని చొప్పున మాత్రమే అనుమతించారు.
కాగా, వలస కార్మికులను రోడ్డు ద్వారా మాత్రమే అనుమతించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకించి, రైళ్ల ద్వారా పంపేందుకు సహకరించాలని కోరిన వేళ, కేంద్రం నిబంధనలను సడలించగా, ఆ వెంటనే దక్షిణ మధ్య రైల్వే ఈ రైలును ఏర్పాటు చేసింది. మరోవైపు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సైతం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరిందని ట్వీట్ చేశారు. కేంద్రం తమ డిమాండ్ కు సానుకూలంగా స్పందించిందని అన్నారు. ఝార్ఖండ్ వచ్చిన వారిని స్వస్థలాలకు తరలిస్తామని, అంతకన్నా ముందే ఆరోగ్య పరీక్షలు జరుపుతామని, వారంతా క్వారంటైన్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇక, ఝార్ఖండ్ కూలీలు దాదాపు 500 మంది హైదరాబాద్ ఐఐటీలో ఆశ్రయం పొందగా, వారిని 57 బస్సుల్లో శుక్రవారం తెల్లవారుజామున అధికారులు లింగంపల్లి స్టేషన్ కు తరలించారు. ఆపై వారిని రైలులోకి అనుమతించారు. ఇదిలావుండగా, పంజాబ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్రలు కూడా తమ రాష్ట్రాలకు చెంది, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రప్పించేందుకు రైళ్లు నడపాలని కోరాయి.