Varla Ramaiah: అనకాపల్లి ఎంపీ వద్ద రేషన్ బియ్యం లారీ పట్టుబడింది... కేసు లేదా సీఎం గారూ?: వర్ల రామయ్య
- బస్తా బియ్యం దొరికితేనే కేసులు పెడతారంటూ ట్వీట్
- లారీ బియ్యం దొరికితే కేసు పెట్టరా? అంటూ ప్రశ్నించిన వర్ల
- మీ ఎంపీకి ఓ న్యాయం, పేదలకో న్యాయమా అంటూ ఆగ్రహం
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ట్విట్టర్ లో సీఎం జగన్ కు ప్రశ్నాస్త్రం సంధించారు. "సీఎం గారూ, పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం లారీ లోడ్ అనకాపల్లి ఎంపీ వద్ద దొరికితే కేసు పెట్టరా? బయటి వ్యక్తుల వద్ద బస్తా బియ్యం దొరికితేనే కేసు పెట్టి జైలుకు పంపుతారు కదా, మరి లారీ లోడు రేషన్ బియ్యం దొరికితే కేసులేదా?" అంటూ ప్రశ్నించారు. మీ ఎంపీకి ఓ న్యాయం, పేదలకొక న్యాయమా? ఇదేమి న్యాయం? అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు.
అనకాపల్లి ఎంపీ, వైసీపీ మహిళా నేత డాక్టర్ సత్యవతి భర్త విష్ణుమూర్తి ఆధ్వర్యంలో నడిచే ఓ ట్రస్టు ఆవరణలో రేషన్ బియ్యం లారీ కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. పేదలకు పంచాల్సిన బియ్యం ప్రైవేటు వ్యక్తుల వద్ద కనిపించడం ప్రభుత్వ వర్గాలను ఆగ్రహానికి గురిచేసింది. దీనిపై లాక్ డౌన్ ముగిసిన తర్వాత విచారణ ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.