Congress: వలస కార్మికులను బస్సుల్లో తరలించాలంటే మూడేళ్లు పడుతుంది: కాంగ్రెస్
- వలస కార్మికుల తరలింపుపై కేంద్రం ప్రకటన
- 40 రోజల తర్వాత ప్రకటన చేస్తున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు
- రైళ్లు ఏర్పాటు చేయాలని సూచన
కరోనా మహమ్మారిని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తుండడంతో వలస కార్మికులు ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. దాంతో వారి తరలింపు కోసం బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ స్పందిస్తూ, దేశంలో వలస కార్మికుల తరలింపుకు అనుమతిస్తున్నట్టు కేంద్రం ఏప్రిల్ 29న చేసిన ప్రకటనను తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ఇది ఏకపక్ష నిర్ణయం అని విమర్శించారు.
లాక్ డౌన్ ప్రకటించిన నెలన్నర రోజుల తర్వాత తీరిగ్గా వలస కార్మికుల తరలింపుపై నిర్ణయం తీసుకుంటారా? అంటూ మండిపడ్డారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కేంద్రం తీరు చూస్తుంటే కార్మికుల సంక్షేమంపై కంటితుడుపు చర్యలా ఉందని అన్నారు.
"వలస కార్మికులను తరలించాలంటూ 40 రోజుల తర్వాత ప్రకటిస్తున్నారు. రాష్ట్రాలకు ఈ విషయంలో మార్గదర్శకాలు ఉన్నా, వలస కార్మికుల సంఖ్య ఎంతో తెలిసి కూడా కేంద్రం ఏంచేసింది? మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే బీహారీ కార్మికులు 25 లక్షల వరకు ఉన్నారు. రాజస్థాన్ లో 2.5 లక్షలు, కేరళలో 4 లక్షలు, పంజాబ్ లో 4 లక్షలు, ఒడిశాలో 7 లక్షలు, అసోంలో 1.5 లక్షల మంది ఉన్నారు. వీళ్లందరినీ బస్సుల్లో తరలించాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. ఇకనైనా వలస కార్మికుల తరలింపు కోసం రైళ్లు ఏర్పాటు చేయండి" అంటూ సలహా ఇచ్చారు.
ఇదిలావుంచితే, ఈ రోజు నుంచి కేంద్రం ఆయా వలస కార్మికులను రైళ్లలో కూడా వారి వారి స్వస్థలాలకు చేరుస్తున్న విషయం విదితమే.