Lockdown: రోజుకు 12 గంటల డ్యూటీకి 6 రాష్ట్రాల నిర్ణయం.. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు
- లాక్ డౌన్ తర్వాత పని గంటలను పెంచనున్న 6 రాష్ట్రాలు
- రోజుకు రెండు షిఫ్టుల్లో పని చేయనున్న కార్యాలయాలు, ఫ్యాక్టరీలు
- ఇది చట్ట విరుద్ధం అంటున్న యూనియన్లు
రెండో విడత లాక్ డౌన్ చివరి దశకు చేరుకుంది. మే 3వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత విధులకు హాజరయ్యే ఉద్యోగుల పని గంటలు పలు రాష్ట్రాల్లో పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 8 గంటల పని వేళలు... 12 గంటలకు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఆరు రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి.
పని వేళలను పెంచడం వెనుక పెద్ద కారణమే ఉంది. మొత్తం సిబ్బందితో కార్యాలయాలు, ఫ్యాక్టరీలు పని చేస్తే కరోనా సమస్య మళ్లీ మొదటకు వచ్చే పరిస్థితి ఉంది. దీంతో, సగం సిబ్బందితో రోజుకు రెండు షిఫ్టుల్లో మాత్రమే పని చేయించాలని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే పని వేళలను పెంచాలనే నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్రాలలో రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్ ఉన్నాయి.
అయితే అదనపు పని గంటలకు తగిన వేతనాన్ని చెల్లిస్తారా? లేదా? అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. రాజస్థాన్ రూల్స్ ప్రకారం అదనపు 4 గంటలను ఓటీగా పరిగణిస్తారు.
ఏప్రిల్ 17న గుజరాత్ ప్రభుత్వం ఓ ప్రకటన చేస్తూ... నెలవారీ జీతాల ఆధారంగా అదనపు పని గంటలకు సరిపడా వేతనాన్ని అదనంగా చెల్లించాలని తెలిపింది. 6 గంటల తర్వాత ఉద్యోగులకు బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయంపై కోర్టుకు వెళ్లేందుకు కార్మిక సంఘాలు, వర్కర్స్ ఆర్గనైజేషన్లు సిద్ధమవుతున్నాయి. ఎన్నో పోరాటాల తర్వాత 8 గంటల పని వేళలు ఆచరణలోకి వచ్చాయని నేతలు అంటున్నారు. 12 గంటల పని వేళలు చట్ట విరుద్ధమని, దీనిపై కోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు.