Bill Gates: కరోనా వ్యాక్సిన్ వచ్చేందుకు గరిష్టంగా రెండేళ్లు పట్టొచ్చు: బిల్ గేట్స్
- కరోనాకు వ్యాక్సిన్ ఒక్కటే విరుగుడు అన్న గేట్స్
- కొవిడ్ ను ఎదుర్కొనే శక్తిమంతమైన మందు లేదని వెల్లడి
- కొన్ని ఔషధాలు ఉన్నా కొవిడ్ ముందు అవి పనిచేయవని వ్యాఖ్యలు
కరోనా రక్కసి రెక్కలు విరిచేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని భావిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుగులేని కరోనా వ్యాక్సిన్ రావాలంటే కనీసం 9 నెలల నుంచి రెండేళ్ల సమయం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడున్న కొన్ని ఔషధాలు శక్తిమంతమైనవే అయినా, ప్రపంచ మానవాళిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేంత సమర్థత వాటికి లేదని తన బ్లాగ్ లో వివరించారు. కొవిడ్-19పై కచ్చితంగా పనిచేస్తుందని చెప్పగల ఔషధమంటూ ఏదీ లేని నేపథ్యంలో, భూమండలంపై ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయడం అత్యంత అవసరం అని స్పష్టం చేశారు.
కరోనా బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వందల కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్ డోసుల్ని అభివృద్ధి చేయాల్సి ఉందని, ఎంత వీలైతే అంత త్వరగా ఈ ప్రక్రియ జరగాలని బిల్ గేట్స్ వివరించారు. ఏప్రిల్ 9 నాటికి 115 కరోనా వ్యాక్సిన్లు వివిధ దశలకు చేరుకున్నాయని, వాటిలో 8 నుంచి 10 వ్యాక్సిన్లు భవిష్యత్ పై ఆశలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.