Eatala: కోలుకుంటున్న వారి శాతం తెలంగాణలోనే అధికం: ఈటల

Eatala says Telangana implements better policies against corona

  • తెలంగాణలో 1044 కరోనా పాజిటివ్ కేసులు
  • 47 శాతం మంది కోలుకున్నారని వెల్లడి
  • మరే రాష్ట్రంలో ఇలాంటి రేటు లేదన్న ఈటల

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో కరోనా పరిస్థితులను వివరించారు. మొత్తం 1044 కేసులు నమోదైతే, కోలుకున్న వారి శాతం 47 అని వెల్లడించారు. దేశంలో ఇలాంటి మెరుగైన రేటు మరే రాష్ట్రంలోనూ లేదని అన్నారు. దాదాపు 10 లక్షల మందికి సరిపడా మాస్కులు, 6 లక్షల మందికి సరిపడా పీపీఈ కిట్లు సమకూర్చుకున్నామని, 20 వేల మందికి ఆక్సిజన్, వెంటిలేటర్లు అమర్చి, ఐసీయూలో చికిత్స అందించే సత్తా తమకు ఉందని తెలిపారు. మరో 80 వేల మందిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందించే సామర్థ్యం తమ సొంతం అని వివరించారు.

ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం ఇక్కడి ఆసుపత్రులను పరిశీలించి అభినందించిందని, కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీవాస్తవ కూడా మెచ్చుకున్నారని తెలిపారు. అయితే, తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారంటూ బీజేపీ నాయకులపై మండిపడ్డారు. కొందరు బీజేపీ నాయకులు కేంద్ర బృందాన్ని కలిసి మీరు హైదరాబాదు ఆసుపత్రుల్లో గమనించిన పరిస్థితులు నిజమేనా? అని అడుగుతున్నారని, నిజానికి బీజేపీ నాయకులు ఏం కోరుకుంటున్నారని ప్రశ్నించారు.

కరోనా మరణాలు, కరోనా పాజిటివ్ కేసులు దాచితే దాగేవి కావని మంత్రి ఈటల అన్నారు. భారత్ లో కరోనా మరణాల రేటు 3.5 గా ఉంటే, తెలంగాణలో 2.5 శాతం మరణాలే సంభవించాయని తెలిపారు. ముందు ప్రకటించినట్టే తెలంగాణలో మే 7 వరకు పకడ్బందీగా లాక్ డౌన్ అమల్లో ఉంటుందని, మే 5న సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News