Maharashtra: ప్రధానికి ఉద్ధవ్ ఫోన్ ఫలితం.. మహారాష్ట్రలో 21న ఎమ్మెల్సీ ఎన్నికలు!
- 28లోపు ఎన్నికలు జరగకుంటే ఉద్ధవ్ పదవికి గండం
- లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలన్న కోష్యారీ
- గవర్నర్ లేఖకు ఈసీ సానుకూల స్పందన
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సీఎం పదవీ గండం నుంచి గట్టెక్కినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికలు జరిగితే ఉద్ధవ్ ఎమ్మెల్సీ అవుతారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగే వీలుంటుంది.
ఆయన ప్రస్తుతం ఇటు శాసన సభలో కానీ, అటు మండలిలో కానీ సభ్యులు కారు. ఉభయ సభల్లో సభ్యుడు కాని వ్యక్తి సీఎం అయితే ఆరు నెలల్లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఆయన సీఎం పీఠాన్ని అధిష్ఠించి ఈ నెల 28తో ఆరు నెలలు పూర్తవుతాయి. ఆ లోపు ఎన్నికలు జరగకుంటే ఆయన పదవి కోల్పోయే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి, పరిస్థితిని వివరించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవలసిందిగా కోరారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం.. రాష్ట్రంలో ఏప్రిల్ 24 నుంచి ఖాళీగా ఉన్న 9 ఎమ్మెల్సీ స్థానాల్లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. లాక్‌డౌన్ ఆంక్షలను కేంద్రం సడలించిన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య ఎన్నికలు నిర్వహించాలని అందులో పేర్కొన్నారు.
దీనికి సానుకూలంగా స్పందించిన ఈసీ ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఫలితంగా పదవీ గండం నుంచి ఉద్ధవ్ బయటపడినట్టేనని శివసేన వర్గాలు చెబుతున్నాయి.
ఇక, రాష్ట్ర శాసనసభలో ఆయా పార్టీల బలాబలాలను బట్టి చూస్తే, శివసేన కూటమి (మహా వికాస్ అఘాడి) ఐదు సీట్లను, బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకుంటాయి.