Corona Virus: ఇది ప్రారంభం మాత్రమే... 17 లక్షల కొత్త వైరస్ లు కాచుకుని ఉన్నాయంటున్న పరిశోధకులు!
- కరాళ నృత్యం చేస్తున్న కరోనా
- ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మందికిపైగా మృతి
- పర్యావరణాన్ని కాపాడుకోకుంటే మరింత ముప్పుందన్న పరిశోధకులు
మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ 2 లక్షలకు పైగా ప్రాణాలను కబళించింది. 30 లక్షల మందికి పైగా దీని బారినపడ్డారు. ఈ విపత్కర పరిస్థితులపై ప్రముఖ పరిశోధకులు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కరోనా వైరస్ విజృంభణ కేవలం ప్రారంభమేనని, ఇప్పటికీ అంతుచిక్కని 17 లక్షల కొత్త వైరస్ లు మానవాళిపై దాడి చేసేందుకు కాచుకుని ఉన్నాయని తెలిపారు. ఈ తరహా వైరస్ లు ప్రధానంగా క్షీరదాల్లోనూ, నీటి పక్షుల్లోనూ ఆవాసం ఏర్పరచుకుని ఉంటాయని వివరించారు. ప్రొఫెసర్ జోసెఫ్ సెటెల్లే, ప్రొఫెసర్ శాండ్రా డియాజ్, ప్రొఫెసర్ ఎడ్వర్డో బ్రాండీజియో, డాక్టర్ పీటర్ డాస్జాక్ ఓ అధ్యయనంలో ఈ వివరాలను పంచుకున్నారు.
మున్ముందు మరింత పెద్ద సంఖ్యలో వైరస్ మహమ్మారులు తరచుగా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని, అవి కరోనాను మించిన వేగంతో, అత్యంత ప్రాణాంతకంగా పరిణమించవచ్చని హెచ్చరించారు. మన పర్యావరణాన్ని మనమే నాశనం చేసుకుంటున్నంత కాలం ఇలాంటి ముప్పులు తప్పవని స్పష్టం చేశారు. మానవుడు పర్యావరణ హితం కోరి తగిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ మహమ్మారి వైరస్ లకు అడ్డుకట్ట పడదని వారు తెలిపారు.
విశృంఖలంగా అడవుల నరికివేత, నిర్దిష్ట విధానమంటూ లేని వ్యవసాయం, అక్రమ తవ్వకాలు, ఎక్కడికక్కడ నిర్మాణాలు, వన్యప్రాణుల హననం... ఇవన్నీ కలిపి అడవుల నుంచి పెను విపత్తును వైరస్ ల రూపంలో మానవాళికి వ్యాపింప చేస్తున్నాయని పరిశోధకుల బృందం వివరించింది. ఇకపై ఈ తరహా వైరస్ విపత్తులు తరచుగా సంభవించవచ్చని స్పష్టం చేసింది.