Donald Trump: సెనేటర్లు భయపడకుండా సభకు రావాలి... కరోనా పరీక్షలకు ఏర్పాట్లు చేశాం: ట్రంప్

Trump says there is tremendous CoronaVirus testing capacity in Washington

  • సోమవారం సమావేశం కానున్న అమెరికా చట్టసభ
  • ఆరోగ్య భద్రతపై డెమొక్రాట్ల నుంచి ఆందోళనలు
  • 5 నిమిషాల్లో ఫలితాన్నిచ్చే టెస్టులు ఉంటాయన్న ట్రంప్

అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో సోమవారం సెనేట్ సమావేశం నిర్వహించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. దాదాపు నెల రోజుల తర్వాత సెనేటర్లు రాజధాని వాషింగ్టన్ లో సమావేశాలకు హాజరుకానున్నారు. అయితే డెమోక్రాట్లు ఆరోగ్య భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ స్పందించారు.

వాషింగ్టన్ లో అద్భుతమైన రీతిలో కరోనా నిర్ధారణ పరీక్షలకు ఏర్పాట్లు చేశామని, సెనేట్ సమావేశాల కోసం వస్తున్న వారు భయపడాల్సిన పనిలేదని, అందరికీ కరోనా టెస్టులు చేస్తామని తెలిపారు. కేవలం 5 నిమిషాల్లో ఫలితాన్నిచ్చే అబ్బాట్ టెస్టులు నిర్వహిస్తామని, సమావేశాల కోసం వాషింగ్టన్ వచ్చే సెనేటర్లు సెనేట్ డాక్టర్ బ్రియాన్ పి మోనాహన్ ను సంప్రదించాలని సూచించారు.

ఇక సభ విషయానికొస్తే, తిరిగి సమావేశం జరుగుతోందంటే అందుకు కారణం స్పీకర్ నాన్సీ పెలోసీ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. కరోనా దెబ్బకు కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఇప్పటికే ఓసారి భారీ ఉద్దీపన ప్రకటించిన ట్రంప్, మరోసారి ఉద్దీపన (కేర్స్-2) ప్రకటించేందుకు తహతహలాడుతున్నారు. అందుకు సభాపరంగా అవసరమైన మద్దతు కోసం సెనేట్ ను సమావేశపరుస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News