Pawan Kalyan: ఆ 1400 మంది టీటీడీ కార్మికులు ఏం పాపం చేశారు?: పవన్ కల్యాణ్
- టీటీడీ నుంచి కార్మికులను తొలగించారంటూ పవన్ వెల్లడి
- ఇది సరైన నిర్ణయం కాదంటూ టీటీడీపై అసంతృప్తి
- నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను తొలగించడం అన్యాయం అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశంలో కరోనా కారణంగా అల్పాదాయ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఒక్క కలం పోటుతో వందలమందిని విధుల నుంచి తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొలగింపుకు గురైనవాళ్లంతా గత 15 ఏళ్లుగా టీటీడీలో పనిచేస్తూ స్వల్ప వేతనాలు అందుకునే చిరు ఉద్యోగులని పవన్ వివరించారు. దేశంలో ఏ ఒక్క కార్మికుడ్ని కూడా విధుల నుంచి తొలగించరాదని, వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారని, ఇప్పుడాయన ప్రకటన కూడా పట్టించుకోకుండా కార్మికులపై వేటు వేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని టీటీడీ పాలకమండలి ఉపసంహరించుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.