Suresh Babu: హీరో, హీరోయిన్లతో పాటు అందరూ పారితోషికాలు తగ్గించుకోవాల్సిందే: సురేష్ బాబు
- కరోనా ప్రభావం సినీ రంగంపై ఇంకొంత కాలం ఉంటుంది
- పెద్ద సినిమాలు ఎక్కువ ఇబ్బంది పడతాయి
- కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇబ్బందులు తప్పవు
కరోనా ప్రభావం సినీ రంగంపై మరికొంత కాలం పాటు ఉంటుందని నిర్మాత సురేశ్ బాబు అన్నారు. ఈ మహమ్మారి వ్యాప్తి ఎలా ఉండబోతుందో చెప్పలేమని తెలిపారు. పరిశ్రమ నష్టాల్లో ఉన్న ఈ సమయంలో హీరో, హీరోయిన్లు, దర్శకులతో పాటు అందరూ పారితోషికాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విడతలవారీగా లాక్ డౌన్ ఎత్తేసినంత మాత్రాన థియేటర్లు తెరుచుకోవని చెప్పారు. చిన్న సినిమా షూటింగులు జరగొచ్చని... ఎక్కువ మంది ఆర్టిసులు అవసరమయ్యే సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం ఇబ్బంది పడొచ్చని అన్నారు. ప్రస్తుతం కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయని... ముందు వాటిని పూర్తి చేసుకుంటే కొంత డబ్బు సంపాదించుకోవచ్చని చెప్పారు.
కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇబ్బందులు తప్పవని సురేశ్ బాబు తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగే అవకాశం ఉందని... సాయంత్రం వరకు ఇంట్లో ఉండి పని చేసినవారు... సాయంత్రాలు రెస్టారెంట్లు, థియేటర్లు, పార్కులకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అడుగులేస్తూ ముందుకు సాగాలని... లేకపోతే ప్రపంచమే నిలబడిపోయే ప్రమాదం ఉందని అన్నారు.