Kirana: మాస్క్ లు ధరించకుంటే కిరాణా సరుకులు నిల్!
- మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి
- ఆ బాధ్యత షాపుల యజమానులదే
- యజమానులకు అనధికార ఆదేశాలు
నిత్యావసర సరకుల నిమిత్తం వచ్చే వారు మాస్క్ లను ధరించకుంటే, వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ సరుకులు ఇవ్వరాదని, మాస్క్ తో వస్తేనే అనుమతించాలని హైదరాబాద్ పరిధిలోని కిరాణా షాపుల యజమానులకు అనధికారిక ఆదేశాలను అధికారులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే పలు షాపుల వద్ద మాస్క్ లు తప్పనిసరిగా ధరించి రావాలన్న బోర్డులను యజమానులు వేలాడదీశారు. కరోనా కేసులు అధికంగా ఉన్న ముషీరాబాద్, అంబర్ పేట, ఖైరతాబాద్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో కస్టమర్ల మధ్య భౌతిక దూరం తప్పనిసరని, కస్టమర్లు నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత దుకాణదారులదేనని కూడా అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
కాగా, తమతమ షాపులకు వచ్చే వారిలో అత్యధికులు మాస్క్ లను ధరించే వస్తున్నారని, కానీ కొంతమంది ఎటువంటి మాస్క్ లు లేకుండా వస్తున్నారని, వారి ద్వారా వ్యాపారాన్ని నష్టపోతున్నామని కొందరు వ్యాఖ్యానించారు. అయితే, మాస్క్ ల నిబంధనను కచ్చితంగా అమలు చేసేందుకు దుకాణాల యజమానులు అంగీకరిస్తున్నారని అధికారులు తెలిపారు.