randeep singh surjewala: ప్రజల ముందుకు రావడానికి సిగ్గుపడ్డ మోదీ, షా: కాంగ్రెస్ విమర్శలు

Congress Fires on Modi and Shah

  • లాక్ డౌన్ పొడిగింపుపై ఒక్కరైనా మాట్లాడలేదు
  • ప్రజలకు కారణాలను చెప్పి సమాధాన పరచలేదు
  • కేంద్రం వ్యూహం ఏంటో వెంటనే తెలియజేయాలి
  • కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా

దేశ ప్రజల ముందుకు రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ షాలు సిగ్గు పడ్డారని, మూడో విడత లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించేందుకు వారితో పాటు ఏ కేంద్ర మంత్రి, అధికారి కూడా ముందుకు రాకపోవడానికి కారణం అదేనని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రజలకు నచ్చజెప్పి, కారణాలు వివరించాల్సిన ప్రభుత్వ పెద్దలు, ఓ ప్రకటన వదిలేసి చేతులు దులుపుకున్నారని కాంగ్రెస్ మీడియా విభాగం ఇన్ చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. లాక్ డౌన్ పొడిగించడానికి కారణాలను గానీ, కేంద్రం అమలు చేయాలనుకుంటున్న వ్యూహాన్ని గానీ వారు తెలియజేయలేదని మండిపడ్డారు. "లాక్ డౌన్ 4.0, లాక్ డౌన్ 5.0 కూడా ఉంటుందా? దీనికి అంతం ఎప్పుడు?" అని ఆయన ప్రశ్నించారు.

కరోనా మహమ్మారితో పోరులో ఇప్పటివరకూ సాధించినది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసిన సుర్జేవాలా, మే 17వ తారీకు వరకూ కేంద్రం పెట్టుకున్న లక్ష్యాలేమిటో ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ప్రమాదంలోకి పడిపోయిందని, లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారని, మే 17 తరువాత ఎటువంటి చర్యలు చేపడతారన్న విషయమై ఇంతవరకూ కేంద్రం సమాలోచనలు కూడా చేయలేదని విరుచుకుపడ్డారు. లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీ ఏంటో వెల్లడించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్, రైతులకు కనీస మద్దతు ధర, పంట కొనుగోళ్లు, పేదలు, కార్మికులైన 40 కోట్ల మంది భారత ప్రజల భవితవ్యం, 11 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తున్న 4.25 కోట్ల ఎంఎస్ఎంఈలకు ఉద్దీపన తప్పనిసరని అన్నారు. 

  • Loading...

More Telugu News