Boris Johnson: కరోనాతో నేను చనిపోతే ఎలా ప్రకటన చేయాలని వైద్యులు ప్రణాళిక వేసుకున్నారు: బోరిస్ జాన్సన్
- ఆసుపత్రిలో నా కోసం వైద్యులు లీటర్ల కొద్దీ ఆక్సిజన్ ఖర్చుచేశారు
- పరిస్థితులు చేదాటిపోతే ఏం చేయాలన్న విషయంపై చర్చించారు
- వాయునాళంలో ప్రత్యేక ట్యూబ్ అమర్చే విషయంపై కూడా ఆలోచించారు
- చివరకు కోలుకునేలా చేసిన ఘనత వైద్యులదే
కరోనా బారిన పడ్డ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న విషయం తెలిసిందే. ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు చెప్పారు. ఒకవేళ దురదృష్టవశాత్తూ తాను మరణిస్తే ఆ వార్తను ఎలా తెలియజేయాలనే విషయంపై ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యులు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారని ఆయన చెప్పారు.
ఆసుపత్రిలో తాను చికిత్స తీసుకుంటోన్న సమయంలో వైద్యులు లీటర్ల కొద్దీ ఆక్సిజన్ ఖర్చుచేశారని జాన్సన్ తెలిపారు. అయినప్పటికీ తన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురగోతి కనిపించకపోవడంతో పరిస్థితులు చేదాటిపోతే ఏం చేయాలన్న విషయంపై వైద్యులు చర్చించుకున్నారని తెలిపారు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న తనకు ఈ విషయం అర్థమవుతూనే ఉందని, అవన్నీ చేదు జ్ఞాపకాలని చెప్పారు. కరోనాతో కొన్ని రోజుల్లోనే తన ఆరోగ్యం బాగా క్షీణించిపోయిందని, తనకు చికాకుగా అనిపించిందని చెప్పారు. ఎందుకు కోలుకోలేకపోతున్నానో తనకే అర్థం కాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
తన వాయునాళంలో ప్రత్యేక ట్యూబ్ అమర్చే విషయంపై కూడా వైద్యులు చర్చించారని తెలిపారు. ఆ విషయాలు తలుచుకుంటే తాను ఉద్వేగానికి లోనవుతున్నానని చెప్పారు. తనకు చికిత్స అందించి తనను కోలుకునేలా చేసిన ఘనత వైద్యులదేనని చెప్పారు. తాను గతంలో చాలా సార్లు గాయపడ్డానని అన్నారు. అయితే, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పారు.