Mohammad Yousuf: ఒక్క మాటలో కోహ్లీ గురించి చెప్పమంటే ఆకాశానికెత్తేసిన పాక్ మాజీ క్రికెటర్
- కోహ్లీ నంబర్ వన్ ప్లేయర్ అన్న యూసుఫ్
- కోహ్లీని గొప్ప ఆటగాడిగా పేర్కొన్న వైనం
- అప్పటి ఆటగాళ్లలో సచిన్ కు అగ్రస్థానం
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరు, దృక్పథం గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటుంది. కోహ్లీ సాధించిన విజయాలు, బౌలర్లపై సాగించే ఆధిపత్యం న భూతో న భవిష్యతి అంటారు. తరానికి ఒక్కరు మాత్రమే జన్మించే ఇలాంటి ఆణిముత్యాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికైనా కష్టమే. పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం మహ్మద్ యూసుఫ్ ను కోహ్లీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలని కోరగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ఇప్పటికిప్పుడు నంబర్ వన్ ఆటగాడు అంటే కోహ్లీనే. గొప్ప ఆటగాడు" అంటూ కితాబిచ్చాడు.
కోహ్లీకి గత తరం ఆటగాళ్లే కాదు, ఇప్పటి జట్టులోని పాక్ ఆటగాళ్లు కూడా అభిమానులేనంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. కోహ్లీ 86 టెస్టుల్లో 53 సగటుతో 7,240 పరుగులు, వన్డేల్లో 248 మ్యాచ్ ల్లో 59 సగటుతో 11,867 పరుగులు సాధించాడు. టీ20ల్లోనూ కోహ్లీ సగటు 50కి తగ్గలేదంటే అతడి బ్యాట్ పవరేంటో అర్థమవుతుంది.
ఇక, యూసుఫ్ తన సమకాలికుల గురించి చెబుతూ, సచిన్ టెండూల్కర్ తర్వాతే ఎవరైనా అని స్పష్టం చేశాడు. అప్పట్లో నంబర్ వన్ ఎవరంటే సచిన్ అనే చెబుతానని, ఆ తర్వాతే లారా, పాంటింగ్, కలిస్, సంగక్కర ఉంటారని వివరించాడు.