Chandrababu: నాడు రాజశేఖర్ రెడ్డి హయాంలో, నేడు జగన్ పాలనలో తెచ్చిన జీవోలపై వ్యతిరేకంగా పోరాడాం: చంద్రబాబునాయుడు
- పత్రికా స్వేచ్ఛకు ప్రమాదం వాటిల్లితే సహించం
- నాడు రాజశేఖర్ రెడ్డి హయాంలో జీవో 938
- నేడు జగన్ పాలనలో జీవో 2430
- పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టడం బాధకరం
పత్రికా స్వేచ్ఛకు కట్టుబడిన పార్టీ తెలుగుదేశం అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా మీడియా మిత్రులకు అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛకు ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా ముందుండి టీడీపీ పోరాడిందని అన్నారు.
ఈ సందర్భంగా నాటి సీఎ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పాలనలపై విమర్శలు చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో జీవో 938 కు, జగన్మోహన్ రెడ్డి పాలనలో జీవో 2430కు వ్యతిరేకంగా పోరాటం చేశామని అన్నారు. పాత్రికేయులపై, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం బాధకరమని, ప్రశ్నించే గొంతును నొక్కాలని చూడటం, మీడియాను అణిచివేయాలని చూడటం హేయమని అన్నారు. ఎక్కడ పత్రికలకు నిజమైన స్వేచ్ఛ ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అభిప్రాయపడ్డారు. పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టడం ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు.