Assam: అసోంలో విజృంభిస్తున్న ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ.. 2,500 వరాహాల మృతి
- వ్యాధి వ్యాప్తి చెందకుండా పందులను సామూహికంగా చంపేందుకు కేంద్రం అనుమతి
- తాము చంపబోమన్న అసోం
- ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని వెల్లడి
కరోనా వైరస్ విషయంలో తొలి నుంచి పూర్తి అప్రమత్తంగా ఉంటూ దానిని దూరం పెట్టిన అసోంను ఇప్పుడో కొత్త సమస్య వేధిస్తోంది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పందుల్లో అత్యంత ప్రమాదకర అంటువ్యాధి అయిన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. దాని బారినపడి ఏడు జిల్లాల్లోని 306 గ్రామాల్లో 2,500కు పైగా పందులు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పందులను సామూహికంగా చంపేందుకు అనుమతించింది.
అయితే, తాము ఆ పని చేయబోమని, వ్యాధిని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపింది. వ్యాధి బయటపడిన ప్రాంతాల్లోని కిలోమీటరు పరిధిలో ఉన్న పందుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షిస్తామని, వ్యాధి లక్షణాలున్న వాటిని మాత్రమే సంహరిస్తామని తెలిపింది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వల్ల మానవులకు ఎటువంటి ప్రమాదం ఉండదని, వ్యాధి లేని ప్రాంతాల్లోని ప్రజలు పంది మాంసాన్ని తినొచ్చని ప్రభుత్వం పేర్కొంది.