Vaccine: హెచ్ఐవీ, డెంగ్యూ తరహాలో కరోనాకు కూడా వ్యాక్సిన్ కష్టమేనా..?
- ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్
- వ్యాక్సిన్ కోసం ముమ్మర పరిశోధనలు
- వ్యాక్సిన్ పై భిన్నాభిప్రాయాలు
ప్రస్తుతం మానవాళికి అత్యంత ప్రబల శత్రువు ఎవరంటే కరోనా అనే చెబుతారు. దాదాపు అన్ని దేశాలు ఈ వైరస్ మహమ్మారితో తీవ్రపోరాటం సాగిస్తున్నాయి. వ్యాక్సిన్ వస్తేనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వేల కోట్ల నిధులతో ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
హెచ్ఐవీ, డెంగ్యూ వంటి వైరస్ లకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదని, కరోనా వైరస్ కూడా వీటి కోవలోకే చేరుతుందని అంటున్నారు. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ రూపకల్పన సాధ్యపడకపోవచ్చని లండన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ నబర్రో తెలిపారు. "కరోనాను తిప్పికొట్టే వ్యాక్సిన్ వస్తుందని గట్టిగా విశ్వసించలేం. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా అది అన్ని రకాల టెస్టులు గట్టెక్కగలదా అనేది ఓ సందేహం" అని పేర్కొన్నారు.
అయితే, మరికొందరు పరిశోధకులు మాత్రం కరోనాకు వ్యాక్సిన్ వచ్చి తీరుతుందని నమ్ముతున్నారు. హెచ్ఐవీ, మలేరియా కారక వైరస్ లతో పోల్చితే కరోనా వైరస్ లో ఉత్పరివర్తన శక్తి తక్కువ అని, హెచ్ఐవీ, మలేరియా కారక వైరస్ లు ఎప్పటికప్పుడు తమ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ వెళ్లడం వల్ల వ్యాక్సిన్ తయారీ ఇప్పటికీ సాధ్యపడలేదని, కరోనా వైరస్ లో ఉత్పరివర్తన వేగం చాలా తక్కువ అని చెబుతున్నారు.