Pawan Kalyan: ‘ఇది సాధారణ జ్వరమే’ అని మాట్లాడటం వల్లే నివారణా చర్యల్లో అలసత్వం: పవన్ కల్యాణ్
- ఈ విధంగా మాట్లాడటం వల్ల నిర్లిప్తత వస్తుంది
- గ్రీన్, ఆరెంజ్ జోన్లు.. రెడ్ జోన్లుగా మారకుండా చూడాలి
- మన ఆరోగ్య శాఖ పటిష్టంగా లేదు
అనంతపురం జిల్లా జనసేన పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ కూడా ఇందులో పాల్గొన్నారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, ప్రభుత్వ చర్యలు, లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో తలెత్తే పరిస్థితులు, రైతాంగం, చేనేత వృత్తి వారి కష్టాలు, వలస కూలీల బాధలు తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. కరోనా వైరస్ అంటే ప్రపంచం అంతా వణికిపోతుంటే, ’ఇది సాధారణ జ్వరమే’ అని మాట్లాడటం వల్లే నివారణా చర్యల్లో అలసత్వం నెలకొని ఉంటుందని అన్నారు. ఈ విధంగా మాట్లాడటం వల్ల నిర్లిప్తత వస్తుందని, మన ఆరోగ్య శాఖ పటిష్టంగా లేకపోవడం వల్ల తలెత్తే దుష్ఫలితాలు ‘కరోనా‘తో బయటపడుతున్నాయని విమర్శించారు.
పని చేయాలని తపించే అధికారులు నిస్సహాయులుగా అయిపోయారని, కేరళ లాంటి రాష్ట్రాలు ముందు నుంచి ప్రజారోగ్యం విషయంలో పకడ్బందీగా ఉండటంతో కరోనా విషయంలో సమర్థంగా వ్యవహరించగలిగాయని ప్రశంసించారు. మన రాష్ట్రంలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచిన వారికి సరైన ఆహారం, సదుపాయాలు లేవన్న విషయం తెలిసిందేనని అన్నారు.
ఈ ఆరోగ్య విపత్తు నియంత్రణలో పాలనా విభాగం వైఫల్యానికి రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తాము పకడ్బందీగా చర్యలు చేపట్టకపోతే ఏపీలోని కర్నూలు, గుంటూరులా తమ రాష్ట్రం కూడా అయ్యేదని తెలంగాణ మంత్రి ఒకరు ఇటీవల వ్యాఖ్యలు చేశారని, ఏపీలో పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఈ మాటలే నిదర్శనమని, ఈ విషయంలో ఏపీని ఉదాహరించి రావడం బాధాకరమేనని అన్నారు.
‘కరోనా’ వ్యాప్తి తీరు, ఉద్ధృతి మరెంత కాలం ఉండవచ్చు అన్న అంశాలపైన, లాక్ డౌన్ సడలింపులపైన జాతీయ స్థాయి నాయకులతో చర్చించానని అన్నారు. లాక్ డౌన్ సడలింపు తర్వాత అసలు సవాల్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లు.. రెడ్ జోన్లుగా మారకుండా చూడటమే అసలైన సవాల్ అని, ఈ విషయంలో రాష్ట్ర పాలనా యంత్రాంగం చాలా అప్రమత్తంగా, సమర్ధంగా వ్యవహరించాలని అన్నారు.