Nadendla Manohar: అనంతపురం జిల్లాలో హిందూపురం నుంచే అత్యధిక ‘కరోనా’ కేసులు: నాదెండ్ల మనోహర్
- హిందూపురం ప్రాంతం భయాందోళనల్లో ఉంది
- అదేవిధంగా అనంతపురం పట్టణ ప్రాంతం కూడా
- ఉద్యానవన పంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
కరోనా వైరస్ కారణంగా అనంతపురం జిల్లాలోని హిందూపురం ప్రాంతం భయాందోళనల్లో ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అనంతపురం జనసేన పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో అత్యధిక ‘కరోనా’ కేసులు హిందూపురం నుంచే నమోదవుతున్నాయని అన్నారు. అదేవిధంగా అనంతపురం పట్టణ ప్రాంతం కూడా ఉందని, ‘కరోనా’ మూలంగా జిల్లాలోని రైతులు తమ పంటలు అమ్ముకోలేకపోతున్న విషయం జిల్లా నాయకుల ద్వారా పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చిందని అన్నారు.
చీనీ, అరటి, దానిమ్మ, మామిడి లాంటి ఉద్యానవన పంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని, మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం పెద్ద మాటలు చెప్పిందని, వాటిని అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, ‘కరోనా’ విపత్తు సమయంలో జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నట్టు తమకు సమాచారం ఉందని అన్నారు. ఈ అక్రమాలపై పార్టీ నాయకులు దృష్టి సారించాలని సూచించారు.