Vijay Devarakonda: నా కెరీర్ ను నాశనం చేయాలని నాలుగు వెబ్ సైట్లు ప్రయత్నిస్తున్నాయి: విజయ్ దేవరకొండ ఆగ్రహం
- నెల రోజులుగా తప్పుడు వార్తలు రాస్తున్నారు
- వివరాల కోసం అడగడానికి మీరెవరు
- పేదల కోసం విరాళాలు సేకరిస్తున్నాం
తన కెరీర్ ను, పేరును నాశనం చేసేందుకు నాలుగు వెబ్ సైట్లు యత్నిస్తున్నాయని హీరో విజయ్ దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై లేనిపోని వదంతులను రాస్తున్నాయని అన్నాడు. పక్క వ్యక్తిని తొక్కి ముందుకు వెళ్లాలనుకునేవారు సమాజంలో ఉన్నారని... ఎదుటివాడు నాశనమైనా పర్వాలేదు, నేను బాగుండాలని వీరు అనుకుంటారని... ఇలాంటి వారు సమాజంలో ఉండటం ప్రమాదకరమని చెప్పాడు. ఇలాంటివారి గురించి మాట్లాడాలనుకుంటున్నానని తెలిపాడు. పేదల సహాయార్థం తన ఫౌండేషన్ తరపున విజయ్ విరాళాలను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కొన్ని వెబ్ సైట్లలో వస్తున్న వార్తలపై ఆయన ఈ మేరకు స్పందించాడు.
సినీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న వెబ్ సైట్లు... తప్పుడు వార్తలు రాస్తూ, వాటిని అమ్ముతూ, డబ్బు చేసుకుంటున్నాయని విజయ్ మండిపడ్డాడు. గత నెల రోజులుగా నాలుగు వెబ్ సైట్లు తనను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాయని, తనపై విపరీతంగా తప్పుడు వార్తలను రాస్తున్నాయని చెప్పాడు. విజయ్ దేవరకొండ ఎక్కడ? ఎక్కడ దాక్కున్నాడు? అంటూ రాస్తున్నాయని అన్నాడు. ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే తప్పుడు వార్తలు రాస్తామని, ప్రకటనలు ఇవ్వకపోతే రేటింగ్స్ తగ్గిస్తామని బెదిరిస్తారని చెప్పాడు. అసలు విరాళాలు అడగడానికి మీరెవరు అని ప్రశ్నించాడు. నాకు ఇవ్వాలనిపించినప్పుడు, ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారికి ఇస్తానని చెప్పాడు.
ఇప్పటికే తెలంగాణ, ఏపీలో పేదల కోసం విరాళాలను సేకరిస్తున్నామని విజయ్ తెలిపాడు. ప్రజలు విపరీతంగా విరాళాలను ఇస్తున్నారని... ఇప్పటికి ఆ మొత్తం రూ. 70 లక్షలు దాటిందని చెప్పాడు. తమ కార్యకలాపాలు ప్రతి ఒక్కరికి తెలియాలని వెబ్ పైట్ లో అప్ డేట్స్ ఇస్తున్నామని తెలిపాడు. అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంటే.. ఆ వెబ్ సైట్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని మండిపడ్డాడు. తాను సేకరిస్తున్న విరాళాల్లో గందరగోళం జరుగుతోందని రాస్తున్నారని చెప్పాడు. సినీ పరిశ్రమ నుంచి తాను విడిపడి... ఈ పని చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు.