Andhra Pradesh: ఏపీలో వినియోగదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న విద్యుత్ బిల్లులు
- ఏప్రిల్‌లో స్పాట్ బిల్లింగ్ నిలిపివేత
- ఈ నెలలో రీడింగ్ తీస్తుండడంతో 500 యూనిట్లు దాటిపోతున్న వైనం
- టారిఫ్ మారిపోయి వేలల్లో బిల్లులు
ఏపీలో విద్యుత్ వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. వందలు, వేలల్లో వస్తున్న బిల్లులు చూసి అవాక్కవుతున్నారు. ఏప్రిల్ నెలలో మీటరు రీడింగ్ తీయకుండా సగటు విద్యుత్ వినియోగం ఆధారంగా గ్రూప్ టారిఫ్ నిర్ణయించి బిల్లులు వసూలు చేయడమే ఇందుకు కారణం.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏప్రిల్‌లో స్పాట్ బిల్లింగ్‌ను నిలిపివేసింది. దీంతో మార్చి నెలలో వినియోగించిన యూనిట్లను ఏప్రిల్ వినియోగంతో కలిపి మేలో బిల్లులు జారీ చేస్తోంది. ఫలితంగా కేటగిరీ మారిపోవడంతో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావడం, దీనికితోడు ఎండలు ముదురుతుండడంతో విద్యుత్ వినియోగం పెరిగింది.
మార్చి, ఏప్రిల్ నెలలకు కలిపి తిరుపతిలోని ఓ వినియోగదారుడికి ఈ నెలలో రీడింగ్ తీస్తే 531 యూనిట్లు రావడంతో రూ.2,542 బిల్లు వచ్చింది. అందులో ఫిబ్రవరిలో సగటు విద్యుత్ వినియోగం ఆధారంగా చెల్లించిన రూ. 450 మినహాయించి మిగతా బిల్లును చేతిలో పెట్టారు. అనంతపురంలో ఓ వ్యక్తికి కూడా రూ.2,522 బిల్లు వచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి రీడింగ్ తీస్తుండడంతో అది 500 యూనిట్లు దాటిపోతోంది. ఫలితంగా టారిఫ్ మారిపోయి యూనిట్‌కు రూ.9.95 వసూలు చేస్తుండడంతో బిల్లులు వేలల్లో వస్తున్నాయని వినియోగదారులు లబోదిబోమంటున్నారు.