KCR: నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపు, మద్యం అమ్మకాలపై చర్చ!
- మధ్యాహ్నం 2 గంటలకు భేటీ
- వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలపై చర్చ
- విద్యార్థుల పరీక్షల నిర్వహణపై నిర్ణయం
- వైద్యారోగ్య శాఖ ఇచ్చిన నివేదికపై చర్చ
రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితి, లాక్డౌన్ అమలు, ఆర్థిక పరంగా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో తెలంగాణలో లాక్డౌన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన సడలింపులను తెలంగాణలో అమలు చేసే విషయంపై కూడా ఓ నిర్ణయం తీసుకుంటారు. మద్యం దుకాణాలకు అనుమతులపై కీలక నిర్ణయం తీసుకుని ప్రకటించనున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే.
వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు, విద్యార్థుల పరీక్షల నిర్వహణ, వైద్యారోగ్య శాఖ ఇచ్చిన నివేదికపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే, సమగ్ర వ్యవసాయ విధానం, నీటి పారుదల శాఖ ప్రాజెక్టులు వంటి అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు.