Andhra Pradesh: నేటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్లకు అనుమతి
- కంటైన్ మెంట్ జోన్లకు వెలుపల ఉన్న కార్యాలయాలకు అనుమతి
- నేటి నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలు
- ‘కరోనా’ కట్టడికి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆదేశం
నేటి నుంచి ఏపీలో సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు తెరచుకున్నాయి. లాక్ డౌన్ మార్గదర్శకాల్లో భాగంగా పలు రంగాలకు మినహాయింపులు లభించడంతో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. కంటైన్ మెంట్ జోన్లకు వెలుపల ఉన్న సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ కార్యాలయాలన్నీ తెరవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో నేటి నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
‘కరోనా’ కట్టడి నిమిత్తం పాటించాల్సిన జాగ్రత్తలను ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చే ప్రజలు విధిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. కార్యాలయాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, ఉద్యోగులు, ఇక్కడికి వచ్చేవారు భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా పేర్కొంది.
కార్యాలయంలో పది మంది కంటే ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని, ఉద్యోగుల హాజరు నిమిత్తం ఉపయోగించే బయోమెట్రిక్ యంత్రాలను నిత్యం శానిటైజ్ చేయాలని సూచించింది. కార్యాలయం పని వేళలు ముగిశాక ప్రతిరోజూ శానిటైజర్ తో ఆఫీస్ శుభ్రం చేయాలని, సంబంధం లేని వ్యక్తులను కార్యాలయంలోకి అనుమతించవద్దని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొంది.