Pawan Kalyan: మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు విధులా?: పవన్ కల్యాణ్
- ఏపీలో తెరుచుకున్న మద్యం దుకాణాలు
- ఉపాధ్యాయుల పరిస్థితి పట్ల పవన్ ఆవేదన
- లాక్ డౌన్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారంటూ ఆగ్రహం
లాక్ డౌన్ నిబంధనలను కేంద్రం పాక్షికంగా సడలించడంతో దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే ఏపీలో పలుచోట్ల మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు విధులు కేటాయించారంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విచారం వెలిబుచ్చారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం దృష్ట్యా ఇలాంటి విధులు సరికాదని హితవు పలికారు. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, అన్నార్తులకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడం కోసం ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకోవడం సబబుగా ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు.
ప్రజలు కరోనా వ్యాప్తి కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారని, ఆలయాలకు ప్రార్థనా మందిరాలకు కూడా వెళ్లకుండా, పండుగలకు కూడా దూరమయ్యారని, అదే సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి లాక్ డౌన్ స్ఫూర్తికి తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు చూసిన తర్వాతే తమిళనాడులోని వేలూరు జిల్లా అధికారులు చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో గోడ కట్టేశారని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా జనసైనికులతో టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.