Somireddy Chandra Mohan Reddy: 'నవరత్నాలు అంటే ఇవేనా..?' అంటూ కొత్త బ్రాండ్ల పేర్లు చదివిన సోమిరెడ్డి

TDP Leader Somireddy responds on new liquor brands in AP

  • మద్యం అమ్మకాలపై వైసీపీ, టీడీపీ మధ్య మాటలయుద్ధం
  • ఎవరికీ తెలియని బ్రాండ్లు అమ్ముతున్నారని సోమిరెడ్డి విమర్శలు
  • ఎక్స్ పోర్టు క్వాలిటీ బ్రాండ్లు కనిపించడంలేదని విస్మయం

ఏపీలో మద్యం అమ్మకాలు షురూ అయిన నేపథ్యంలో టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏపీలో విడ్డూరంగా ఉందని, ఎవరికీ తెలియని బ్రాండ్లు ఇక్కడ అమ్ముతున్నారని విమర్శించారు. తాగేవాళ్లకైనా, తాగనివాళ్లకైనా కొన్ని బ్రాండ్ల పేర్లు తెలుస్తాయని, కానీ ప్రస్తుతం ఏపీలో అమ్ముతున్న బ్రాండ్లు కనీవినీ ఎరుగనివని ఎద్దేవా చేశారు. నవరత్నాలు అంటే ఇవేనా అంటూ 9 నూతన బ్రాండ్ల పేర్లు చదివి వినిపించారు.

బూమ్ బూమ్, కోలా, బ్లాక్ బస్టర్, గెలాక్సీ, 9 సీ హార్సెస్ అంటూ పలు రకాల మద్యం బ్రాండ్ల గురించి చెప్పారు. కింగ్ ఫిషర్, 5000, నాకౌట్ బీర్లు, బ్యాగ్ పైపర్, ఆఫీసర్స్ చాయిస్ ఇవన్నీ ఎక్స్ పోర్ట్ క్వాలిటీ ఉన్న బ్రాండ్లు అని, ఇప్పుడవి ఏమైపోయాయో తెలియడంలేదని సోమిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విదేశాలకు ఎగుమతి అయ్యే ఆ బ్రాండ్లు ఇప్పుడు రాష్ట్రంలో కనిపించడంలేదని విస్మయం చెందారు.

మెక్ డోవెల్స్ బ్రాండ్ మద్యం తయారుచేసే సింగరాయకొండలోని ఓ డిస్టిలరీ మూతపడిందని, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో ఉన్న ఓ డిస్టిలరీ టీడీపీ హయాంలోనూ ఉందని, కానీ ఇప్పుడు దాంట్లో గ్రీన్ చాయిస్, రోల్ మోడల్ గోల్డ్ రమ్, రాయల్ ప్యాలెస్, బ్రిటీష్ ఎంపైర్, కింగ్ లూయిస్ అంటూ కొత్త కొత్త బ్రాండ్లు తయారుచేస్తున్నారని సోమిరెడ్డి వివరించారు. ఏనాడైనా ఈ బ్రాండ్ల పేర్లు విన్నామా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News