Perni Nani: చంద్రబాబే డబ్బులిచ్చి వైన్ షాపుల వద్ద లైన్లలోకి పంపుతున్నారు: పేర్ని నాని
- కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి
- చంద్రబాబు జగన్ ను మాత్రమే విమర్శిస్తున్నారు
- కేసుల భయంతో మోదీని విమర్శించలేకపోతున్నారు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఏపీలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని మంత్రి పేర్ని నాని చెప్పారు. దేశ వ్యాప్తంగా లిక్కర్ షాపులకు ప్రధాన మోదీ మినహాయింపులను ఇచ్చారని... దీన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
ప్రజలను అయోమయానికి గురి చేసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని... ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు వంద రూపాయలు ఇచ్చి వైన్ షాపుల వద్ద క్యూలైన్లలోకి పంపుతున్నారని, మాస్కులు పెట్టుకోవద్దని వారికి చెపుతున్నారని... ఆ తర్వాత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఎల్లో మీడియా ద్వారా క్షుద్ర రాజకీయం చేస్తున్నారని అన్నారు.
బ్రాందీ షాపులను తీయమని చెప్పింది మోదీ అయితే... ముఖ్యమంత్రి జగన్ ను చంద్రబాబు విమర్శిస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ఎన్నికల ముందు మోదీని చంద్రబాబు చెప్పరాని మాటలతో తిట్టారని... ఇప్పుడు జైల్లో వేస్తారనే భయంతో ప్రేమ సందేశాలను పంపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈడీ కేసులతో చంద్రబాబు భయపడుతున్నారని... అందుకే మోదీని విమర్శించలేకపోతున్నారని అన్నారు.