Centre: చైనా నుంచి వచ్చే కంపెనీల కోసం ఓ చిన్నదేశం సైజులో భూమిని సిద్ధం చేసిన కేంద్రం!
- కరోనా నేపథ్యంలో చైనాలో కొనసాగేందుకు బడా కంపెనీల విముఖత!
- పెద్ద కంపెనీలను ఆకర్షించాలని భావిస్తున్న కేంద్రం
- 4.61 లక్షల హెక్టార్ల భూమి సిద్ధం!
కరోనా వైరస్ విశ్వరూపం నేపథ్యంలో మునుపటిలా అంతర్జాతీయ సంస్థలు చైనాలో కార్యకలాపాలు కొనసాగించే పరిస్థితి కనిపించడంలేదు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని భారత్ భావిస్తోంది. చైనాను వీడి వచ్చే కంపెనీలు అధిక జనాభాతో పాటు వనరులు పుష్కలంగా ఉన్న భారత్ వైపే చూస్తాయని కేంద్రం విశ్వసిస్తోంది. ఆర్థిక సంస్కరణలు కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఊతమిచ్చేలా ఉన్నాయని నమ్ముతున్న కేంద్రం ఈమేరకు చైనాను వదిలి వచ్చే సంస్థలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకాలని ప్రణాళికలు రచిస్తోంది.
చైనా భూభాగంలో ఉన్న తమ యూనిట్లను, ప్లాంట్లను అమెరికా, దక్షిణ కొరియా, యూరప్ దేశాలు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తుండగా, ఆ కంపెనీలను భారత్ వైపు మళ్లించాలన్నది కేంద్రం ప్రధాన వ్యూహం. అందుకోసమే ఏకంగా 4.61 లక్షల హెక్టార్ల భూమిని సిద్ధంగా ఉంచినట్టు సమాచారం. ఈ భూమి విస్తీర్ణం దృష్ట్యా లగ్జెంబర్గ్ (2.43 లక్షల హెక్టార్లు) దేశం కంటే పెద్దది.
పెద్ద కంపెనీలు వస్తే వాటికి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఉన్న భూములను కేటాయించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కసరత్తులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ విషయమై ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడినట్టు కేంద్ర వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.