Donald Trump: అవును, రీ ఓపెన్ వల్ల మరింత మంది అమెరికన్ల ప్రాణాలు పోవచ్చు!: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
- ఆంక్షలు తొలగించకుంటే వ్యవస్థ అతలాకుతలం
- వైట్ హౌస్ ను దాటి తొలి అధికారిక పర్యటనకు వచ్చిన ట్రంప్
- ముఖానికి మాస్క్ ధరించకపోవడంతో విమర్శలు
అమెరికాలో మరింతమంది మరణించే ప్రమాదం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రకటించిన ఆంక్షలను తొలగించకుంటే, ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని, ఆర్థిక వ్యవస్థ కోసం నిబంధనలు సడలిస్తే, మరింత మంది మరణిస్తారని ఆయన అన్నారు. తాజాగా, ఆరిజోనాలోని మాస్క్ లను తయారు చేసే కర్మాగారాన్ని సందర్శించిన ఆయన, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాస్క్ ధరించేందుకు కూడా నిరాకరించడం గమనార్హం.
దేశంలో భౌతిక దూరం నిబంధనలను కాస్త తొలగిస్తూ, ఆర్ధిక కార్యకలాపాలను పునఃప్రారంభించడం (రీ ఓపెన్) తప్పదని, ఆ పని చేస్తే, మరికొంత మంది మరణిస్తారని 'ఏబీసీ న్యూస్' ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. "మనం ఓ అపార్టుమెంట్ లోనో, ఇంట్లోనే తాళాలు వేసుకుని ఉండలేము. కొంతమంది ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. అయినా సరే మనం మన దేశంలో అన్ని కార్యకలాపాలనూ తెరవాల్సిందే" అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఇక మాస్క్ లను తయారు చేసే పనిలో నిమగ్నమైన హనీవెల్ కార్మికులను, ఉద్యోగులను ట్రంప్ అభినందించారు. వారి కోసం తాను చీర్ లీడర్ గా మారతానని వ్యాఖ్యానించారు. అక్కడి ఉద్యోగులతో సమావేశమైన వేళ, అందరూ మాస్క్ లను ధరిస్తే, ట్రంప్ మాత్రం దానికి దూరంగా ఉన్నారు. "దయచేసి అందరూ అన్ని వేళలా మాస్క్ లను ధరించండి" అన్న సైన్ బోర్డు కనిపిస్తూనే ఉన్నా, ట్రంప్ దాన్ని పట్టించుకోలేదు.
లాక్ డౌన్ నిబంధనలు ప్రారంభమైన తరువాత వైట్ హౌస్ ను దాటని ట్రంప్, తొలిసారిగా అధికారిక పర్యటనకు వచ్చిన వేళ, మాస్క్ తో కనిపిస్తారని అందరూ భావించారు. వైట్ హౌస్ వైద్యాధికారులు, తొలి మహిళ మెలానియా ట్రంప్ సైతం మాస్క్ లను ప్రమోట్ చేస్తున్న వేళ, ప్రజలంతా పాటిస్తున్న నియమాలను ట్రంప్ పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. కాగా, అమెరికాలో ఇంతవరకూ 70 వేల మంది వరకూ కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.