India: ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు... రేపటి నుంచి మొదలు పెట్టనున్న ఇండియా!

World Largest Evacuation Operation From Tomorrow by India

  • సుమారు 3 లక్షల మందిని స్వదేశానికి చేర్చే లక్ష్యం
  • విమానాలు, నౌకల ద్వారా తరలింపు
  • గల్ఫ్ వార్ తరువాత అతిపెద్ద ఇవాక్యుయేషన్
  • వచ్చిన వారందరికీ 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి
  • స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

కరోనా వ్యాపిస్తున్న తరుణంలో విధించిన లాక్ డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుబడిపోయిన లక్షలాది మంది భారతీయుల తరలింపు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ చరిత్రలో ఓ దేశం తలపెట్టిన అతిపెద్ద ఇవాక్యుయేషన్ ఇదే కావడం గమనార్హం. మొత్తం 3 లక్షల మందికి పైగా ప్రజలు, తాము ఇండియాకు తిరిగి వస్తామని ఇప్పటికే దరఖాస్తు చేశారు. వీరందరి కోసం ప్రత్యేక విమానాలను నడపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇక యూరప్ దేశాల నుంచి ఇండియాకు వచ్చేందుకు రూ. 50 వేలను, అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేందుకు రూ. 1 లక్ష చార్జీగా నిర్ణయించారు. ఇక, మాల్దీవులు, పశ్చిమ ఆసియా దేశాల్లో ఉన్న భారతీయులను యుద్ధ నౌకల ద్వారా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి గల్ఫ్ వార్ సమయంలో అక్కడి దేశాల్లో చిక్కుకుపోయిన 1.70 లక్షల మందిని ఇండియాకు చేర్చిన తరువాత ఇదే అతిపెద్ద తరలింపు ఆపరేషన్ కావడం గమనార్హం.

కాగా, తొలి దశలో 13 దేశాల్లో చిక్కుకుపోయిన 14,800 మందిని 64 విమాన సర్వీసుల ద్వారా ఈ వారంలో ఇండియాకు తీసుకురానున్నారు. వీరంతా కేవలం భారత పౌరులు, ఓవర్ సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులు లేని వారేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీరి తరలింపు గురువారం నాడు ప్రారంభం కానుండగా, 2,300 మంది శుక్రవారం నాటికి ఇండియా చేరనున్నారు. 10 విమానాలు యూఏఈ నుంచి యూఎస్, యూకే, సౌదీ అరేబియాల నుంచి 7, సింగపూర్ నుంచి 5, ఖతార్ నుంచి 2 విమానాలు వస్తాయని, మలేషియా, బంగ్లాదేశ్, కువైట్, ఫిలిప్పీన్స్, ఓమన్, బహరైన్ నుంచి కూడా సర్వీసులు నడుస్తాయని అధికారులు తెలిపారు.

ప్రతి విమానంలో భౌతిక దూరం పాటించేలా 200 నుంచి 300 మందిని మాత్రమే అనుమతిస్తామని, విమానం ఎక్కే ముందు ప్రయాణికులకు జ్వరం, దగ్గు వంటి లక్షణాలు లేవని నిర్ధారించుకుంటామని పేర్కొన్నారు. ఇక ఇండియా నుంచి వెళ్లే విమానాల్లో ఆయా దేశాలకు వెళ్లాలని భావించి, చెల్లుబాటులో ఉండే వీసాలను కలిగున్నవారిని తీసుకెళతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, అందుకు వెళ్లాలనుకునే దేశం అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది.

ఇండియాకు వచ్చే ప్రతి ఒక్కరినీ 14 రోజుల పాటు క్వారంటైన్ గృహాల్లో ఉంచుతామని, ఆ తరువాతనే వారు ఇంటికి వెళ్లేందుకు అనుమతి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. సముద్ర మార్గం కోసం ఐఎన్ఎస్ శార్దూల్, ఐఎన్ఎస్ మగర్, ఐఎన్ఎస్ జలాశ్వలు సిద్ధంగా ఉన్నాయి. భారత వాయు సేన 30 విమానాలను సిద్ధం చేసింది. ఇందులో బోయింగ్ సీ-17 గ్లోబ్ మాస్టర్, లక్ హీడ్ మార్టిన్ సీ-130జే సూపర్ హెర్క్యులస్ లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News