Bihar: డబ్బులు పారేసుకున్నాడు... కరోనా భయంతో ఎవరూ ముట్టుకోలేదు!
- జేబులో ఉన్న పొగాకు ప్యాకెట్ తీస్తే కిందపడిపోయిన డబ్బు
- కరోనా వ్యాప్తి కోసం ఎవరో పారేశారనుకుని పోలీసులకు ఫిర్యాదు
- వివరాలు తెలుసుకుని డబ్బు వెనక్కు ఇచ్చిన అధికారులు
రోడ్డుపై డబ్బులు కనిపిస్తే, కళ్లకద్దుకుని తీసుకుని జేబులో పెట్టుకునే రోజులు పోయాయి. కరోనా వైరస్ ను వ్యాపించేందుకు, ఎవరో నోట్లు పారేశారన్న భయంతో ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నారు. ప్రజల్లో నెలకొన్న కరోనా భయం, డబ్బు పోగొట్టుకున్న ఓ వ్యక్తిని ఆదుకుంది. అతను పోగొట్టుకున్న డబ్బును తిరిగి అతనికి అందించింది. బాధితుడు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...
బీహార్ లోని సహర్ష జిల్లాలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నగజేంద్ర షా, అనే వ్యక్తి, కొన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకు రూ. 25 వేలు జేబులో పెట్టుకుని బయటకు వెళ్లాడు. మార్కెట్ కు చేరేందుకు కాస్తంత దూరంలో ఉండగానే, జేబులో నుంచి రూ. 20,500 పోయినట్టు గుర్తించాడు. తన జేబులో ఉన్న పొగాకు ప్యాకెట్ ను తీసే సమయంలో అవి కిందపడి వుంటాయని భావించి, వెనక్కు వెళ్లాడు. కానీ డబ్బు దొరకలేదు.
ఇదే దిగులుతో గజేంద్ర ఇంటికి చేరుకోగా, ఫేస్ బుక్ లో ఓ వార్త కనిపించింది. రోడ్డుపై పడిన డబ్బును కరోనా భయంతో ఎవరూ తీసుకోకపోవడంతో, ఉడా కిషన్ గంజ్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారన్న వార్త అది. దీంతో గజేంద్ర పరుగులు పెడుతూ స్టేషన్ కు వెళ్లి, ఆ డబ్బు తనదేనని చెప్పి, అందుకు ఆధారాలు సమర్పించడంతో, పోలీసులు దాన్ని వెనక్కు ఇచ్చారు.
రోడ్డుపై డబ్బులు పడివున్నాయని, ఎవరో కరోనాను వ్యాపించేందుకు రోడ్డుపై నోట్లు పడేసి పోయారని తమకు ఫిర్యాదు అందిందని, దీంతో తాము వెళ్లి, ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నామని తెలిపిన ఉడా కిషన్ గంజ్ ఇనస్పెక్టర్ శశిభూషణ్ సింగ్, గజేంద్ర షా నుంచి వివరాలు తెలుసుకున్న తరువాత, వాటిని వెనక్కు ఇచ్చేశామని అన్నారు. ఇక పోయిందనుకున్న డబ్బులు తిరిగి దొరకడంతో గజేంద్ర ఫుల్ ఖుషీగా ఉన్నాడు.