Italy: కరోనా వైరస్‌కు టీకా అభివృద్ధి చేశామన్న ఇటలీ.. ఆశలు నింపిన ప్రకటన
- టీకా తయారుచేసినట్టు వెల్లడించిన ఇటలీ న్యూస్ ఏజెన్సీ
- ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో అద్భుత ఫలితాలు
- వేసవి తర్వాత క్లినికల్ ట్రయల్స్
కరోనా వైరస్‌కు తాము వ్యాక్సిన్ తయారు చేసినట్టు ఇటలీ చేసిన ప్రకటనతో ప్రపంచం మొత్తం అటువైపు దృష్టి సారించింది. ప్రపంచంలోనే తొలిసారిగా తాము కరోనా వైరస్‌కు టీకా తయారుచేసినట్టు ఇటలీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇటలీ ఈ ప్రకటన చేయగానే కరోనా బాధిత దేశాల్లో ఆశలు రేకెత్తాయి. టకీస్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా అద్భుతమైన ఫలితాలు కనిపించినట్టు న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
రోమ్‌లోని స్పల్లాంజనీ ఆసుపత్రిలో దీనిని పరీక్షించినట్టు పేర్కొంది. వ్యాక్సిన్ ప్రయోగంలో ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ అని టకీస్ సీఈవో లుయిగి ఆరిసిచియో అన్నారు. ఈ వేసవి తర్వాత క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని ఆయన వివరించారు. ఈ వ్యాక్సిన్‌ను ఎలుకల్లో ఒక్క డోస్ ఎక్కించగానే వాటిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని, కరోనా వైరస్ మానవ కణాలకు సోకకుండా ఈ వ్యాక్సిన్ నిరోధించగలదని అరిసిచియో ఆశాభావం వ్యక్తం చేశారు.