Shirdi: షిర్డీ ఆలయంపై లాక్ డౌన్ ఎఫెక్ట్... రోజుకు ఎంత నష్టపోతోందంటే..!
- భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్న ప్రముఖ ఆలయాలు
- షిర్డీకి రోజుకు రూ. 6 లక్షల ఆదాయం మాత్రమే వస్తున్న వైనం
- జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగితే రూ. 150 కోట్ల నష్టం
కరోనా కారణంగా దేశంలోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. దీంతో, అనునిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే ప్రముఖ ఆలయాలు పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్నాయి. కోట్లాది మంది ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే షిర్డీ సాయి ఆలయం కూడా కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతోంది. ప్రతి రోజు రూ. 1.5 కోట్లకు పైగా ఆదాయాన్ని నష్టపోతోంది. మార్చ్ 17 నుంచి మే 3వ తేదీ వరకు ఆన్ లైన్ డొనేషన్ల రూపంలో ఆలయానికి రూ. 2.53 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. అంటే రోజుకు దాదాపు రూ. 6 లక్షలు మాత్రమే వచ్చినట్టు లెక్క.
వాస్తవానికి షిర్డీ ఆలయానికి విరాళాల రూపంలో ఏడాదికి రూ. 600 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అంటే ప్రతిరోజు సరాసరి రూ. 1.64 కోట్ల ఆదాయం వస్తుందన్నమాట. ఈ లెక్కన లాక్ డౌన్ కారణంగా ప్రతి రోజు రూ. 1.58 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగితే టెంపుల్ ట్రస్ట్ ఏకంగా రూ. 150 కోట్ల మేర నష్టపోతుంది. ఈ నష్టం ఆలయ ట్రస్టు చేపడుతున్న పలు సామాజిక సేవా కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.