Liquor Sales: ఏపీలో కొత్త రూల్... ఆధార్ కార్డు ఉంటేనే మద్యం విక్రయం!
- రెడ్ జోన్ల నుంచి బయటకు వస్తున్న ప్రజలు
- వైన్స్ షాపుల వద్ద క్యూలైన్లలోకి
- కరోనా వ్యాపించకుండా అధికారుల చర్యలు
రెడ్ జోన్ల నుంచి కొందరు ఇతర జోన్లకు మద్యం కోసం వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధనను తెచ్చింది. సదరు కొనుగోలుదారు తన ఆధార్ కార్డును చూపిస్తేనే మద్యాన్ని విక్రయించాలని నిర్ణయించింది. రెడ్ జోన్లు, కంటైన్ మెంట్ క్లస్టర్ల పరిధిలో మద్యం దుకాణాలు తెరవకపోవడంతో, ఆ ప్రాంతాల నుంచి బయటకు వస్తున్న వారు, మద్యం కోసం క్యూ లైన్లలోకి వస్తున్నారని, ఈ కారణంగానే ఆధార్ కార్డును పరిశీలించాలని నిర్ణయించామని అధికారులు వెల్లడించారు. ముఖానికి మాస్క్, గొడుగులు ధరించి మాత్రమే మద్యం కోసం రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలావుండగా, రాష్ట్రంలో మొత్తం 3,463 వైన్స్ దుకాణాలుండగా, బుధవారం 2,330 మాత్రమే తెరచుకున్నాయి. 663 దుకాణాలను కంటైన్ మెంట్ జోన్ల పరిధిలో ఉన్న కారణంగాను, ప్రజల ఆందోళనలతో 16 షాపులను, టెక్నికల్ కారణాలతో 18 షాపులను, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయన్న అనుమానాలతో 69 షాపులను అధికారులు తెరవనివ్వలేదు. ఇతర కారణాలతో మరో 284 షాపులు కూడా తెరచుకోలేదు. విక్రయానికి తగినంత స్టాకు లేని కారణంగా 83 షాపులు తెరచుకోలేదు. ఇక తొలి రెండు రోజులతో పోలిస్తే బుధవారం వైన్స్ షాపుల వద్ద క్యూలైన్లు తగ్గాయి.