AP Police: రెండోసారి గ్యాస్ లీకైందన్న వార్తలు అవాస్తవం: ఏపీ పోలీస్ శాఖ
- వైజాగ్ లో ఘోర ప్రమాదం
- ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకై ఎనిమిది మంది దుర్మరణం
- మళ్లీ గ్యాస్ లీకైందంటూ వార్తలు
- మరమ్మతులు చేస్తూ కొంత ఆవిరిని బయటికి పంపారన్న పోలీసులు
వైజాగ్ లోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి ప్రమాదకర వాయువు లీకవడం, ఎక్కడివాళ్లు అక్కడే కుప్పకూలిపోవడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందగా, వందల మంది వైజాగ్ లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, వైజాగ్ లో మరోసారి గ్యాస్ లీకైందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై ఏపీ పోలీస్ విభాగం స్పందించింది.
వైజాగ్ లో రెండోసారి గ్యాస్ లీకైనట్టు వస్తున్న కథనాల్లో నిజం లేదని, ఎల్జీ పాలిమర్స్ సంస్థ పరిసరాల్లో మరోసారి ప్రమాదం జరిగిందన్న వార్తలు నమ్మవద్దని స్పష్టం చేసింది. ఘటన స్థలంలో మరమ్మతులు చేస్తున్న నిపుణుల బృందం ఆయా వ్యవస్థలను సరిదిద్దే క్రమంలో కొంత ఆవిరిని బయటికి పంపించిందని, అంతేతప్ప రెండోసారి గ్యాస్ లీక్ వట్టిదేనని వివరించింది.