Vijayashanti: ఓ వైపు కరోనా, మరోవైపు విషవాయువు... చాలా బాధగా ఉందంటున్న విజయశాంతి!
- వైజాగ్ లో గ్యాస్ లీక్ ఘటన
- ఎంతో వేదన కలిగిస్తోందన్న విజయశాంతి
- పరిస్థితులు త్వరగా కుదుటపడాలని ఆకాంక్ష
వైజాగ్ శివారు ప్రాంతం ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకై 9 మంది మరణించడంతో పాటు పెద్ద సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడడం అందరినీ కలచివేస్తోంది. దీనిపై సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు.
ఓవైపు కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ విశాఖపట్టణం, పరిసర గ్రామాల ప్రజలు విషవాయువు బారినపడడం ఎంతో బాధ కలిగిస్తోందని ట్వీట్ చేశారు. వృద్ధులు, మహిళలు, బాలలు, మూగజీవాలు ఈ విషవాయు ప్రభావంతో మరణించడమో, తీవ్ర అస్వస్థతకు గురవ్వడమో సంభవించిందని, ఈ పరిణామాలు తీరని వేదన మిగిల్చాయని పేర్కొన్నారు.
ఇప్పటికే మొక్కవోని ధైర్యంతో కరోనాపై పోరాడుతున్న విశాఖ పౌరులు, పరిసర గ్రామ ప్రజలు, ఈ దుర్ఘటన నుంచి కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు విజయశాంతి తెలిపారు. బాధిత కుటుంబాల వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.