NHRC: వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 'ఎన్ హెచ్ఆర్ సీ' నోటీసులు
- సంచలనం సృష్టించిన వైజాగ్ విషవాయువు లీక్ ఘటన
- సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
- నాలుగు వారాల్లో సమాధానమివ్వాలంటూ నోటీసులు
ఎక్కడ చూసినా ప్రజలు కుప్పకూలిపోయిన స్థితిలో, కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా అవస్థలు పడుతున్న విధంగా వైజాగ్ లో ఈ ఉదయం హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. నగర శివార్లలోని ఎల్జీ పాలిమర్స్ అనే పరిశ్రమ నుంచి లీకైన విషవాయువు ఈ తీవ్ర పరిణామాలకు కారణమైంది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన ఎన్ హెచ్ఆర్ సీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
మీడియా కథనాలనే ప్రాథమిక సమాచారంగా పరిగణిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో కొందరు మృత్యువాత పడడమే కాకుండా, చాలామంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడడం, మరికొందరికి శరీరంపై దద్దుర్లు రావడం వంటి విషయాలను ఎన్ హెచ్ఆర్ సీ గుర్తించింది. ఇప్పటివరకు ఈ ఘటన మానవ తప్పిదంగానో, నిర్లక్ష్యంగానో జరిగినట్టు వెల్లడి కాకపోయినా, ఇది మానవ హక్కులకు సంబంధించి తీవ్రమైన ఉల్లంఘనగా కమిషన్ భావిస్తోంది.
"జీవించడం ప్రజల హక్కు. అలాంటి హక్కును కేత్రస్థాయి నుంచి ఉల్లంఘించారు. ఓవైపు కరోనా వైరస్ వ్యాప్తికి భయపడి అందరూ ఇళ్లలో ఉన్న సమయాన ఉరుముల్లేని పిడుగులా ఈ విషవాయువు లీకైంది" అని కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని ఏపీ సీఎస్ ను ఆదేశించింది. వైద్య చికిత్స వివరాలు, సహాయక చర్యల వివరాలు కూడా తమకు నివేదించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్ తాలూకు వివరాలు, దర్యాప్తు వివరాలు తమకు తెలియజేయాలంటూ రాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపింది.
అటు, ఈ వ్యవహారంలో నియమనిబంధనల ఉల్లంఘన జరిగిందేమో పరిశీలించాలని సంబంధిత విభాగం కార్యదర్శిని ఆదేశించాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా నోటీసులు జారీ చేసింది. తమ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఎన్ హెచ్ఆర్ సీ అందరికీ నాలుగు వారాల గడువు విధించింది.