AIRF: శ్రామిక్ రైళ్లపై రాజకీయాలొద్దంటూ సోనియాకు లేఖ రాసిన ఏఐఆర్ఎఫ్
- రైల్వే శాఖకు ఇటీవల లేఖ రాసిన సోనియా గాంధీ
- రైల్వే ఎంతో శ్రమించి కార్మికులను తరలిస్తోంది
- రాజకీయ ప్రయోజనాల కోసం మంచి వ్యవస్థను అస్థిరపరచొద్దని వినతి
వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు డబ్బులు తీసుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇటీవల ఓ లేఖ రాశారు. రైళ్లను ఉచితంగా నడపాలని, అవసరమైతే ఆ డబ్బులు తాము ఇస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ విషయమై అఖిల భారత రైల్వే మెన్ సమాఖ్య (ఏఐఆర్ఎఫ్) స్పందిస్తూ సోనియాకు ఓ లేఖ రాసింది. వలస కార్మికులను తరలిస్తున్న శ్రామిక్ రైళ్ల విషయంలో రాజకీయాలు చేయొద్దని ఆ లేఖలో కోరింది. ‘కరోనా’ వ్యాపించి ఉన్న పరిస్థితుల్లో రైళ్లలో ప్రయాణం అత్యంత ప్రమాదకరమని తెలిసినా, రైల్వే సిబ్బంది ఎంతో శ్రమించి వలస కార్మికులను తరలిస్తోందని తెలిపింది. రాజకీయ ప్రయోజనాల కోసం మంచి వ్యవస్థను అస్థిరపరిచే పనులు చేయొద్దని ఆ లేఖలో ఏఐఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ విజ్ఞప్తి చేశారు.
కాగా, లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించేందుకు ఈ నెల 1 నుంచి శ్రామిక్ రైళ్లు నడుస్తున్నాయి. రైల్వే అధికారుల ప్రకటన మేరకు నిన్నటి వరకు 1.35 లక్షల మంది వలస కార్మికులను 140 శ్రామిక్ రైళ్ల ద్వారా వారి సొంత రాష్ట్రాలకు తరలించారు.