Jammu And Kashmir: కొత్తగా పీఓకేను కూడా లిస్టులో చేర్చిన భారత వాతావరణ విభాగం!
- పీఓకేలో వాతావరణ సూచనలను అందిస్తున్న భారత్
- జమ్మూకశ్మీర్ డివిజన్ లో పీఓకే
- పీఓకేలో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల తీర్పునిచ్చిన పాక్ సుప్రీంకోర్టు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత భూభాగంలో అంతర్భాగమని చాటిచెపుతూ... ఆ ప్రాంతంపై ఆధిపత్యం సాధించే దిశగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఓకేలోని గిల్గిత్ బాల్టిస్థాన్, ముజఫరాబాద్ ప్రాంతాలకు సంబంధించిన వాతావరణ సూచనలు అందివ్వడం ప్రారంభించింది. ఈ ప్రాంతాన్ని జమ్మూకశ్మీర్ సబ్ డివిజన్ లో భాగంగా పరిగణిస్తున్నామని ప్రాంతీయ వాతావరణ విభాగం అధికారి కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు. మే 5 నుంచి పీఓకేలో వాతావరణ సూచనలను అందిస్తున్నామని చెప్పారు.
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ ఎం.మహాపాత్ర మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడినప్పటి నుంచి పీఓకేను కూడా వెదర్ బులెటిన్ లో చేర్చుతున్నామని తెలిపారు. అయితే, ఇప్పడు జమ్మూకశ్మీర్ డివిజన్ లో పీవోకేను చేర్చుతున్నట్టు అధికారులు అధికారికంగా ప్రకటించడం గమనార్హం.
మరోవైపు, పీఓకేలో ఎన్నికలను నిర్వహించాలని పాక్ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. గిల్గిత్ బాల్టిస్థాన్ ఎప్పటికీ తమ దేశంలో భాగమని, తమ నుంచి వీటిని ఎవరూ వేరు చేయలేరని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కు బుద్ధి చెప్పేందుకు పీఓకేలో కూడా వాతావరణ సూచనలు చేయాలని ఐఎండీకి సూచించినట్టు సమాచారం.