NDRF: పరిశ్రమను పునఃప్రారంభించే సమయంలో గ్యాస్ లీకైనట్టు భావిస్తున్నాం: ఎన్డీఆర్ఎఫ్
- విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీక్
- 11 మంది మృతి, వందల మందికి అస్వస్థత
- సహాయక చర్యలు ముమ్మరం చేసిన ఎన్డీఆర్ఎఫ్
వైజాగ్ లోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వేకువజామున లీకైన స్టిరీన్ గ్యాస్ 11 మందిని పొట్టనబెట్టుకుంది. వందలమంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలకు ఉపక్రమించాయి. విషవాయువు ప్రభావంతో కొందరు ఇళ్లలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తలుపులు బద్దలుకొట్టి వారిని కాపాడినట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ స్పందించారు.
లాక్ డౌన్ కారణంగా కొన్నిరోజులుగా మూతపడిన పరిశ్రమను పునఃప్రారంభించే సమయంలో గ్యాస్ లీకైనట్టు భావిస్తున్నామని వెల్లడించారు. లీకైన గ్యాస్ ను స్టిరీన్ గా గుర్తించామని, ఇది మానవుల కేంద్ర నాడీ వ్యవస్థపైనా, గొంతు, చర్మం, కళ్లు, ఇతర భాగాలపైనా ప్రభావం చూపిస్తుందని వివరించారు. ఆర్ఆర్ వెంకటాపురం గ్రామ పరిసరాల్లో తమ బృందాలు పర్యటిస్తున్నాయని, వాటిలో ప్రత్యేకంగా గ్యాస్ లీకేజి సమస్యలకు సంబంధించిన బృందం కూడా ఉందని, అస్వస్థతకు గురైన ప్రజలను గుర్తిస్తున్నామని తెలిపారు.
అటు, విశాఖ జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, ఎల్జీ పాలిమర్స్ సంస్థలోని శీతలీకరణ విభాగంలో ఏర్పడిన సాంకేతిక లోపమే ప్రమాదానికి దారితీసినట్టు అభిప్రాయపడ్డారు.