Dilbagh Singh: రియాజ్ నైకూ చెప్పుకోదగ్గ పోరాట యోధుడేమీ కాదు: జమ్మూ కశ్మీర్ డీజీపీ
- ఎన్ కౌంటర్ గురించి వివరించిన డీజీపీ
- పారిపోయేందుకు ప్రయత్నించాడని వెల్లడి
- హోదాకు తగిన పోరాటం కనబర్చలేదని వ్యాఖ్యలు
గత కొన్నేళ్లుగా అటు భద్రతా బలగాలకు, ఇటు జమ్మూ కశ్మీర్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ నైకూ ఎన్ కౌంటర్ లో హతమైన సంగతి తెలిసిందే. దీనిపై జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ మాట్లాడారు. గత ఆర్నెల్లుగా జమ్మూ కశ్మీర్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఓ ప్రత్యేక బృందం రియాజ్ కదలికలను అనుసరిస్తోందని తెలిపారు. ప్రతిసారి ఏదో విధంగా తప్పించుకునేవాడని, అతడికి పుల్వామా జిల్లాలో అనేక స్థావరాలు ఉండడంతో సులువుగా ఏమార్చేవాడని వివరించారు.
"కానీ 15 రోజులుగా అతడికి అత్యంత సమీపంలోకి వెళ్లగలిగాం. రేయింబవళ్లూ అతడి ఆనుపానులపై కన్నేసి చివరికి అతడి స్వగ్రామం బేఘిపొరాలోనే మట్టుబెట్టాం. రియాజ్ తనకవసరమైన వస్తు సామగ్రి కోసం ఎవరెవర్ని కలుస్తున్నాడన్న వివరాలు తెలిసిన తర్వాత ఈసారి తప్పించుకోవడం అసాధ్యమని గట్టి నిర్ణయానికి వచ్చాం. ఓ ఇంట్లో ఉన్నాడన్న కచ్చితమైన సమాచారంతో దాడి చేసి అతడితో పాటు ఉన్న మిలిటెంట్ ను కాల్చి చంపాం.
రియాజ్ నైకూ పోరాట యోధుడైతే తన సహచరుడు చనిపోయిన తర్వాత మాపై మరింత తీవ్రంగా పోరాడాలి. కానీ, అతడు అక్కడ్నించి తప్పించుకునేందుకు మార్గాలు వెదకడం మొదలుపెట్టాడు. దాంతో, రియాజ్ పెద్ద వీరుడేమీ కాదని అర్థమైంది. అతడు ఎక్కడ దాక్కున్నా మావాళ్లు వదల్లేదు. చివరికి ఓ చోట ఇక తప్పించుకోలేనని అర్థమవడంతో కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల గురించి మా వాళ్లు భయపడిందే లేదు. రియాజ్ స్థాయి రీత్యా అతడు చేసిన చివరి ప్రయత్నాలు చూస్తే యోధుడు కాదని తేలిపోయింది" అని వివరించారు.