Aaqib Javed: మ్యాచ్ ఫిక్సింగ్ కు భారత్ కీలక స్థావరం అంటున్న పాకిస్థాన్ మాజీ పేసర్
- ఐపీఎల్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని వెల్లడి
- ఫిక్సింగ్ గురించి మాట్లాడితే కెరీర్ ముగిసిందన్న ఆకిబ్
- కోచ్ పదవి కూడా దక్కలేదని ఆవేదన
90వ దశకంలో పాకిస్థాన్ జట్టులో ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన ఆకిబ్ జావెద్ భారత్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి ముఖ్య స్థావరం భారత్ లోనే ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్ లో అవినీతిపై ఎన్నో ఆరోపణలున్నాయని తెలిపాడు. మ్యాచ్ ఫిక్సర్ల గురించి వివరాలు వెల్లడించినందుకే తన కెరీర్ ముగిసిందని భావిస్తున్నట్టు ఆకిబ్ చెప్పాడు.
ముక్కలు ముక్కలుగా నరికేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయని, కెరీర్ లో ఓ దశకు వచ్చిన తర్వాతే ఫిక్సింగ్ వంటి తీవ్ర అంశాలపై మాట్లాడాల్సి ఉంటుందన్న విషయం అర్థమైందని వివరించాడు. ఇలాంటి కారణాలతోనే తాను పాక్ జట్టు కోచ్ పదవి కూడా దక్కించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ మాఫియా ఎంతో బలమైనదని, ఒకసారి అందులో ప్రవేశిస్తే తిరిగి రాలేరని వెల్లడించాడు. అయితే ఫిక్సింగ్ లో ఆటగాళ్లే శిక్షలకు గురవుతున్నారని, ఫిక్సింగ్ మాఫియాను కూడా శిక్షించాలని అభిప్రాయపడ్డాడు.