LG Polymers: అర్ధరాత్రి మళ్లీ లీకైన విషవాయువు.. ప్రాణభయంతో రోడ్లపైకి వందలాదిమంది!
- అర్ధరాత్రి రద్దీగా మారిన రోడ్లు
- సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు
- గ్యాస్ బయటకు రాకుండా గడ్డకట్టించే ప్రయత్నం చేస్తున్న శాస్త్రవేత్తలు
విశాఖపట్టణం వాసులను ఎల్జీ పాలిమర్స్ భయం వీడడం లేదు. గత అర్ధ రాత్రి కూడా మళ్లీ పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ కావడంతో జనం భయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఎన్ఏడీ, బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, అడివివరం, పినగాడి, సింహాచలం, ప్రహ్లాదపురం, వేపగుంట ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ప్రాణాలు అరచేత పట్టుకుని అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
మరోవైపు, పూణెకు చెందిన ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన 9 మంది శాస్త్రవేత్తలు గ్యాస్ లీక్ అయిన ఎల్జీ పాలిమర్స్‌లోకి వెళ్లి పరిశోధన ప్రారంభించారు. న్యూట్రలైజర్‌ను ఉపయోగించి విషవాయువు బయటకు రాకుండా గడ్డకట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం సురక్షితంగా ఉందని, నేడు శాస్త్రవేత్తలు ప్రకటన చేయనున్నారని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు.