Corona Virus: మహమ్మారి శరవేగం... 10.2 రోజుల్లోనే రెట్టింపు కేసులు!

Corona Doubling Time Reduced in India

  • తగ్గిపోతున్న రెట్టింపు సమయం
  • మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీల్లో విస్తరిస్తున్న కరోనా
  • రోజుకు 95 వేల పరీక్షలు చేస్తున్నామన్న కేంద్రం

ఇండియాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. కేసులు రెట్టింపు అయ్యే సమయం 10.2 రోజులకు తగ్గింది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇదే సమయంలో రికవరీ రేటు పెరిగిందని, మరణాల రేటు 3.3 శాతం వుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఈ వారం ప్రారంభంలో కేసుల రెట్టింపు సమయం 12 రోజులుగా ఉండగా, గత మూడు రోజుల్లో పెరిగిన కేసులతో ఈ సమయం తగ్గింది. మరోవైపు కొత్త కేసుల విషయంలో పాత రికార్డులు బద్దలవుతున్నాయి. నిత్యమూ అత్యధిక కేసులు వస్తున్నాయి. దీంతో కేసులు రెట్టింపు కావడానికి అయ్యే సమయం తగ్గుతూ వస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి కొత్త కేసులపై సరైన సమాచారం అందడం లేదని తెలుస్తోంది. "మిగతా దేశాలతో పోలిస్తే, ఇండియాలో మరణాల రేటు తక్కువగానే ఉంది" అని ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ తాజాగా వ్యాఖ్యానించారు. దేశంలోని కరోనా బాధితుల్లో తీవ్రత తక్కువగా వుందని, 1.1 శాతం మంది వెంటిలేటర్లపై వుండగా, 3.3 శాతం మందికి ఆక్సిజన్ అందిస్తున్నామని, ఇక ఐసీయూలో 4.8 శాతం మంది ఉన్నారని ఆయన వెల్లడించారు.

సోమ, మంగళవారాల్లో రోజుకు 75 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా, ఆ సంఖ్య ప్రస్తుతం 95 వేలకు చేరిందని తెలిపిన హర్షవర్ధన్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 327 ప్రభుత్వ, 118 ప్రైవేటు లాబొరేటరీల్లో పరీక్షలు జరుగుతూ ఉన్నాయని, ఇప్పటివరకూ 13.57 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని అన్నారు. కాగా, గురువారం నాటికి ఇండియాలో 52,952 మంది కరోనా బారిన పడగా, 15,266 మంది చికిత్స తరువాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 3,561 కేసులు వచ్చాయి. ఇదే సమయంలో 1,084 మంది డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 28.8 శాతానికి మెరుగు పడింది.

  • Loading...

More Telugu News